శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (15:45 IST)

ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూల్స్ - తెలంగాణలో జూన్ 8న టెన్త్ ఎగ్జామ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు మూడో తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జాగ్రత్తలతో ఆగస్టు 3న పాఠశాలలు పున:ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 
 
కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'స్కూళ్లలో 9 రకాల సదుపాయాలు కల్పించాలి. రూ.456 కోట్లు ఇప్పటికే విడుదల చేశాం. స్కూళ్లలో పనులు పూర్తికావాలంటే కలెక్టర్లు ప్రతిరోజు రివ్యూ చేయాలి. 15,715 పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టాలని' అని సీఎం ఆదేశించారు. 
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఈ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెల్సిందే. అయితే, ఈ పరీక్షలను జూన్‌ 8 తర్వాత నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని చెప్పింది.
 
భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. అయితే, జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కారుని హైకోర్టు ఆదేశించింది. ఆ సమయంలోనూ కేసుల తీవ్రత పెరుగుతున్నట్లయితే, అప్పటి పరిస్థితులను బట్టి మరో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. 
 
కాగా, తెలంగాణలో లాక్డౌన్‌కి ముందు పదో తరగతి పరీక్షలు మూడు జరగగా, మరో ఎనిమిది మిగిలి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్షల కేంద్రాల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో జులైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. కరోనా తీవ్రతను బట్టి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.