శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (10:40 IST)

ఏపీ ఉద్యోగార్థులకు శుభవార్త... టెట్ పరీక్ష నిర్వహించేందుకు చర్యలు

telangana govt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్దమైన సర్కారు... ఇపుడు టెట్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2022, 2023 సంవత్సరాల్లో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించనుందని తెలుస్తోంది. ఏపీలో 2022లో చివరిసారిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పట్లో 4.5 లక్షల మంది పరీక్షకు హాజరు కాగా దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య 5 లక్షలు దాటొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 
 
అయితే, ఈ దఫా ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేలా టెట్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు గతంలో డిగ్రీలో 50 శాతం మార్కులు కనీసార్హతగా నిర్ణయించారు. అయితే, ఈసారి మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ సడలింపు ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి 5 తరగతి బోధనకు ఉద్దేశించిన పేపర్ 1 పరీక్ష అభ్యర్థులకు గతంలో ఇంటర్మీడియట్లో 50 శాతం మార్కులతో పాటూ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకెండరీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. 
 
అలాగే నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుండాలి. అయితే, తాజాగా మరో నిబంధన కూడా జోడించారు. దీని ప్రకారం, ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి. లేదంటే, డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్‌ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్ 1 పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు పాఠశాల విద్యాశాఖ ఐదు శాతం మార్కులు సడలింపు ఇచ్చింది.