బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (14:42 IST)

ధరల నిషా... బార్లలో మండుతున్న మద్యం ధరలు

నవ్యాంధ్రలో మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, ప్రైవేట్ బార్లలో వీటి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఫలితంగా మద్యం కంటే కూడా ధరల నిషానే అధికంగా కనిపిస్తోంది. ఒక క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.50 పెంచగా ఫుల్‌బాటిల్ మద్యంపై రూ.250 మేరకు పెంచారు. రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకున్న తర్వాత అనేక మార్పులు సంభవించాయి. ముఖ్యంగా, గత మూడు నెలలుగా గమనిస్తే రాష్ట్రంలో మద్యం షాపుల నిర్వాహకుల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. 
 
ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈ యేడాది అక్టోబరు ఒకటో నుంచి అమల్లోకి రాగా 2020 జనవరి ఒకటో నుంచి బార్లకు కొత్త పాలసీ రానుంది. ఈ నేపథ్యంలో బార్లలో మద్యం ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి. ఇప్పుడు అమ్ముతున్న ధరలకు అదనంగా క్వార్టర్‌కు రూ.60 చొప్పున ఫుల్‌ బాటిల్‌కు రూ.240 రేట్లు పెంచేశారు. దీంతో మందుబాబులు బార్లకు వెళ్ళాలంటేనే బెంబేలెత్తుతున్నారు.
 
ప్రభుత్వ వైన్‌ షాపులలో క్వార్టర్‌ రూ.150 అమ్ముతుండగా బార్‌లో అదే మందు రూ.180కి అమ్ముతున్నారు. ఒక పక్క ప్రభుత్వ మద్యం దుకాణాలలో తక్కువ ధరకు మద్యాన్ని అమ్ముతున్నారు. మరో పక్క బార్‌లో మద్యం ధరలను మరింతగా పెంచేశారు. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన రేట్లను చూస్తే మద్యం ప్రియులకు కళ్ళు తిరుగుతున్నాయి.
 
మద్యం కంటే కూడా ధరలు చూసి నిషా ఎక్కుతుంది. నిర్ణీత సమయంలోనే ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్ముతుండగా బార్‌లలో మాత్రం రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. బార్‌లకు సరఫరా చేసే మద్యానికి భారీగా రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచారు. దీంతో క్వార్టర్‌ బాటిల్‌కు అదనంగా రూ.60ని బార్‌ల యజమానులు వసూలు చేస్తున్నారు. ఫుల్‌బాటిల్‌కు రూ.240 చొప్పున మద్యం ధర వసూలు చేస్తున్నారు.