మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:23 IST)

కరోనా రోగులు మరణిస్తే అంత్యక్రియలకు రూ.15 వేలు : సీఎం జగన్

కరోనా వైరస్ బారినపడిన రోగులు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలకు రూ.15 వేలు ఆర్థికసాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అలాగే, కరోనా బాధితులకు వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. పైగా, ఇలాంటి ఆసుపత్రుల అనుమతులను కూడా రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తిపై ఆయన మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, వైద్య, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. 
 
బాధితులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై కూడా ఫోకస్ పెట్టాలని చెప్పారు. కరోనా సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లలో అన్నీ సక్రమంగా ఉండేలా చూసే బాధ్యత అధికారులదేనని తెలిపారు. రానున్న వారం రోజుల పాటు అధికారులు ఈ అంశాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు.
 
కరోనాపై దీర్ఘకాలం పోరాడాల్సిన అవసరం ఉందని... చేస్తున్న పనుల్లో నాణ్యత లేకపోతే ఫలితాలను సాధించలేమన్నారు. రానున్న రోజులను దృష్టిలో ఉంచుకుని వసతులను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా పరీక్షలు చేసేందుకు శాశ్వత కేంద్రాలు ఉండాలని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 
 
కరోనా వచ్చిందనే అనుమానం వచ్చిన వ్యక్తి ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్ చేయాలి? ఏం చేయాలి? అనే విషయాలపై చైతన్యం కలిగించేలా హోర్డింగులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్షోభ సమయంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి మెరుగైన జీతాలను ఇవ్వాలని జగన్ అన్నారు. 
 
ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ, అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డేటా బేస్‌ సిద్ధం చేశామన్నారు. కనీసం 17 వేల మందికి పైగా డాక్టర్లు, 12 వేల మందికి పైగా నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. దీని అమలుకు వైఎస్‌ జగన్‌ అక్కడికక్కడే అంగీకారం తెలిపారు. 
 
నేడు కేబినెట్‌ భేటీ
సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇసుక సరఫరాకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది.