1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 22 డిశెంబరు 2021 (19:27 IST)

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులతో గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరంగా చర్చించారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ విషయం గురించి ప్రధానంగా చర్చించారు. 
 
 
అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజనరెడ్డి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఉన్నటువంటి ఆందోళన, అసంతృప్తిని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రొఫెషన్ డిక్లరేషన్ చేయాలని,  ఇటీవల గ్రామ వార్డు సచివాలయ రాష్ట్ర శాఖ విడుదల చేసిన ఆదేశాల వల్ల‌నే ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
 
ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, ఉద్యోగులు ఎవరు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ హామీ ఇచ్చారు. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. పదకొండవ పిఆర్సి సచివాలయ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని అసోసియేషన్ నాయకులు అజయ్ జైన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. 
 
 
ప్రమోషన్ ఛానల్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని, కొన్ని శాఖలకు ఇప్పటికీ సర్వీస్ రూల్స్ లేని విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సెరికల్చర్ ఏఎన్ఎం మహిళా పోలీస్ ఈ శాఖలకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ను వెంటనే రూపొందించి వారి ప్రమోషన్ చానల్స్ కూడా స్పష్టం చేయాలని కోరారు. జాబ్ చార్టులో స్పష్టత లేకపోవడం వలన చాలా శాఖలకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.


గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి హోదాలో అసిస్టెంట్ అనే పదానికి బదులుగా సెక్రెటరీ అనే పదాలను తీసుకురావాని, కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భీమిరెడ్డి అంజన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అంకమ్మరావు అడిషనల్ జనరల్ సెక్రెటరీ కిషోర్ నాయకులు శ్రీధర్ రెడ్డి సువర్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.