ఆర్టీజీఎస్‌కు కలామ్ ఇన్నోవేషన్ అవార్డు... రాష్ట్రపతిని సమ్మోహనపరచిన సాంకేతిక సదుపాయం
అమరావతి: పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైవిధ్య ఆవిష్కరణ రియల్ టైమ్ గవర్నెనెన్స్‌కు కలామ్ ఇన్నోవేషన్ అవార్డు గుర్తింపు లభించింది. పరిపాలనలో సరికొత్త ఆవిష్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వాలకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెంటర
అమరావతి: పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైవిధ్య ఆవిష్కరణ రియల్ టైమ్ గవర్నెనెన్స్‌కు కలామ్ ఇన్నోవేషన్ అవార్డు గుర్తింపు లభించింది. పరిపాలనలో సరికొత్త ఆవిష్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వాలకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఏటా కలాం ఇన్నోవేషన్ అవార్డులను ప్రదానం చేస్తుంటుంది. ఈ ఏడాది రియల్ టైమ్ గవర్నెన్స్ సోసైటీకి ఈ అవార్డు వరించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శనివారం జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్టీజీఎస్ సీఈఓ అహ్మద్ బాబు ఈ పురస్కారాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంధ్ర చేతుల మీదగా రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ సమక్షంలో అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్టీజీఎస్ పనితీరు గురించి తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఆర్టీజీఎస్‌కు కలామ్ ఇన్నోవేషన్ అవార్డు రావడం పట్ల సీఈఓ ఎ.బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆ పురస్కార స్ఫూర్తితో కేంద్రం పనితీరును మరింత మెరుగుపరచి ప్రభుత్వం నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనలు, ప్రోత్సాహ ఫలితమే ఆర్టీజీఎస్ విజయవంతం కావడానికి కారణమని తెలిపారు.
వైవిధ్య ఆవిష్కరణ... దేశంలో మరే ఇతర రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఆర్టీజీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం స్వల్ప వ్యవధిలోనూ అనూహ్య ఫలితాలను సాధిస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలకు మధ్య ఒక చక్కటి వారధిలా ఆర్టీజీఎస్ పనిచేస్తోంది. వెలగపూడి సచివాలయంలో అత్యాధునిక టెక్నాలజీ సొబగులతో రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆసియాలోనే అతి పెద్దదైన 62 అడుగుల వీడియో వాల్‌ను ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల సర్వైలెన్స్ కెమెరాలను ఆర్జీజీసీకి అనుసంధానం చేసి ఎప్పటికప్పడు ప్రత్యక్షంగా ప్రజల అవసరాలను పర్యవేక్షించి వారికి ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు...
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్టజీఎస్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 5 వేల సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పర్యవేక్షించడమే కాకుండా విపత్తలు, ఏదైనా సంఘటనలు, పారిశుధ్యం తదితర అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంటారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తగా ఇలాంటివి మరో 20వేల కెమెరాలు అమర్చనున్నారు.
* టెక్నాలజీతో ఆర్టీజీఎస్ నుంచి ఒకేసారి కొన్నివేల మంది ప్రజలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించవచ్చు. ప్రజలు, అధికారులు, సిబ్బంది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ వీడియో కాన్ఫరెన్సుకు అనుసంధానమై ప్రభుత్వంతో సంభాషించవచ్చు.
ఎల్‌హెచ్ఎంఎస్:
లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా రాష్ట్రంలో చోరీలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి బయట ప్రాంతాలకు వెళితే వారి ఇళ్ల వద్ద సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ఇంటికి డిజిటల్ గస్తీ కాస్తున్నారు.
అవేర్:
ఇస్రో సాయంతో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పడు ఈ కేంద్రం నుంచి పర్యవేక్షించి రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
భూసార ఫరీక్షల వివరాలు:
భూసార పరీక్షలను ఎప్పటికప్పడు నిర్వహించి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. భూసార పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా రైతులు ఎలాంటి పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటందో ముందుగానే సలహాలు అందిస్తున్నారు.
పరిష్కార వేదిక:
ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించడానికి ఆర్టీజీఎస్ ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక (1100 కాల్ సెంటర్) ప్రజలకు ఎంతో చేరువైంది. 24 గంటల పాటూ పనిచేసే ఈ కాల్ సెంటర్‌లో ఒక్కో షిప్టుకు 750 మంది ఉద్యోగులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని తక్షణం సంబంధిత అధికారులకు పంపి అవి పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తుంటారు. తొమ్మిది నెలల కాలంలోనే 1.47 కోట్ల ఫిర్యాదులు ప్రజల నుంచీ స్వీకరించి అందులో 1.30 కోట్ల ఫిర్యాదులను పరిష్కరించారు.
ప్రశంసలు:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీజీఎస్‌కు ఇటీవల కాలంలోనే ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవలే ఈ ఆర్టీజీని సందర్శించి ఈ కేంద్రం పనితీరును అద్భుతంగా ఉందని కేంద్రంలో కూడా ఈ తరహా విధానం ఉండాలని ప్రశంసించారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈ కేంద్రాన్ని సందర్శించి ఆర్టీజీఎస్ ఆవిష్కరణ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఈ కేంద్రంలో ఉన్నంతసేపు తాను భారత్‌లో ఉన్నట్లుగా అనిపించలేదని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని తాము సిఫారసు చేస్తామని తెలిపారు. త్వరలో ఢిల్లీలో జరిగే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సదస్సులో ఆర్టీజీఎస్ గురించి ప్రత్యేకంగా ప్రదర్శించాలని ఆహ్వానం పలికారు.