ఏపి కొత్త సీఎస్... నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరణ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సెప్టెంబర్ 30న (ఆదివారం) అనిల్ చంద్ర పునేఠ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సెప్టెంబర్ 30న (ఆదివారం) అనిల్ చంద్ర పునేఠ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో ఉన్న సీఎస్ కార్యాలయంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెలాఖరున సీఎస్‌గా దినేష్ కుమార్ పదవీ విరమణచేయనున్నారు. ఆయన నుంచి అనిల్ చంద్ర పునేఠ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఢిల్లీ యూనివర్శిటీ నుంచి సాధారణ డిగ్రీతో పాటు ఎల్.ఎల్.బి. పట్టా ఆయన పొందారు. ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ఏంజిలియాలో రూరల్ డవలప్మెంట్‌లో ఎం.ఏ చేశారు. అనిల్ చంద్రపునేఠా 1984లో ఐఏఎస్ ఎన్నికయి, ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడ్డారు. తొలుత అనిల్ చంద్ర పునేఠ కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ గానూ విధులు నిర్వహించారు.
తరవాత మెదక్, కర్నూల్ జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా, మెదక్ డీఆర్డీఏ పీవోగానూ బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి.గా విధులు నిర్వహించారు. వాటర్ కన్జర్వేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, రూరల్ డవలెప్మెంట్, హార్టీ కల్చర్ కమిషనర్‌గానూ పనిచేశారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా, ఎక్స్ ఆఫిసియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీసీఎల్ఏగా పనిచేస్తున్నారు.