ఆంధ్రా గడ్డపై అడుగుపెట్టను : రాహుల్ భీషణ ప్రతిజ్ఞ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భీషణ ప్రతిజ్ఞ చేశారు. సీమాంధ్రకు తాము చేసిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈ తరహా ప్రతిజ్ఞ చేశారు. తాను ప్రధానమంత్రిని కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భీషణ ప్రతిజ్ఞ చేశారు. సీమాంధ్రకు తాము చేసిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈ తరహా ప్రతిజ్ఞ చేశారు. తాను ప్రధానమంత్రిని కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతానని స్పష్టంచేశారు. అలా చేయలేని పక్షంలో సీమాంధ్ర గడ్డపై అడుగుపెట్టబోనని తేల్చిచెప్పారు.
కర్నూలు వేదికగా 'సత్యమేవ జయతే' పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నారు. 'ఐదేళ్లు హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ చెప్పగా పదేళ్లు కావాలని బీజేపీ నాయకులు అన్నారు. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. విభజన హామీలూ అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఐదుకోట్ల ఆంధ్రులు నిలదీస్తే... మీ కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా ప్రధాని మోడీ చేయలేరు. ఆకాశం, భూమివైపు అటూఇటూ చూస్తూ మొహం చాటేస్తారు' అని వ్యాఖ్యానించారు.
'2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వస్తాం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే... ఏపీకి ప్రత్యేక హోదా ఫైలుపైనే తొలి సంతకం చేస్తాను. కాంగ్రెస్ నీతీనిజాయితీతో కూడిన పార్టీ. హామీ ఇస్తే అమలు చేసి తీరుతుంది. ఇచ్చిన మాట నెరవేర్చిన తర్వాతే మళ్లీ ఈ గడ్డపైన అడుగు పెడతాను' అని రాహుల్ ప్రకటించారు.
సీమాంధ్రకు ఏం చేయాలా అని విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ ఆలోచించారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కడప ఉక్కు, రైల్వేజోన్, రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, ఐఐటీ, ఐఐఎం వంటి 12 జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా కృష్ణా-గోదావరి బోర్డుల ఏర్పాటు వంటి హామీలు ఇచ్చారు. దీనిపై కేబినెట్ ఆమోద ముద్ర కూడా పడింది. ఇవి మన్మోహన్ వ్యక్తిగతంగా చెప్పిన మాటలు కావు. ఒక దేశ ప్రధానిగా ఇచ్చిన హామీలు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నా, ఒక్కటీ అమలు చేయలేదంటూ ప్రధాని మోడీపై మండిపడ్డారు.