శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (16:51 IST)

నవ్యాంధ్ర నూతన రాజధాని విశాఖపట్టణం : తమ్మినేని సీతారాం

నవ్యాంధ్ర నూతన రాజధాని విశాఖట్టణం అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గంలోని బూర్జ ప్రాంతంలో ఆయన వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 
 
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో కర్నూలులో హైకోర్టును, అమరావతిలో సచివాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు అవుతుందని, ఎడ్యుకేషన్‌ హబ్‌గా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ఏర్పాటవుతుందని దీనిలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తే మీకు వచ్చే నష్టం ఏమిటని టీడీపీ నేతలను ప్రశ్నించారు. 
 
అమరావతిలో భూములను అడ్డగోలుగా వేరే వారి పేర్లుతో కొనుగోలు చేసి అవి ఎక్కడ నష్టపోతాయోనన్న భయంతో అక్కడ ఉన్న రైతాంగాన్ని రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధిస్తుందని, అది ఓర్వలేకనే చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో సచివాలయ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.