శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (12:27 IST)

హలో ఆర్కే.. ప్రజలు కావాలో.. జగన్ కావాలో తేల్చుకో : తెదేపా ఎమ్మెల్యే

మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ళ రామకృష్ణారెడ్డి)కు తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓ సలహా ఇచ్చారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను ఆదుకోవాల్సిన ఆర్కే.. ఇపుడు పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. ఇపుడు ఆర్కే ముందు ఒక్క మార్గమే ఉందన్నారు. ప్రజలు కావాలో... జగన్ కావాలో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు.
 
రాజధాని మార్పునకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు గత 12 రోజులుగా ఆందోళన చేస్తూ, నిరసన తెలుపుతున్న విషయం తెల్సిందే. అయితే, నిన్నామొన్నటివరకు ప్రజలతో కలిసిమెలిసి తిరిగిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాత్రం గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. దీంతో తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఓట్లేసిన ప్రజలు రోడ్ల మీదకు వస్తే... వారితో కనీసం మాట్లాడటం కూడా లేదని విమర్శించారు. భూములను త్యాగం చేసిన రైతులకు ఇవ్వాల్సింది ప్లాట్లు కాదని... ప్రజా రాజధానిని ఇవ్వాలని అన్నారు. రాజధానిని మరోచోటుకి తరలించి ప్లాట్లు ఇస్తే... రైతులు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు.
 
రాజధాని ప్రాంత రైతులకు స్పష్టతను ఇవ్వకుండా... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఆర్కే మాట్లాడుతున్నారని అనగాని మండిపడ్డారు. మంగళగిరి ప్రజలు కావాలో? జగన్ కావాలో? ఆర్కే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా ఆర్కే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తే... ఆర్కే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని సత్యప్రసాద్ హెచ్చరించారు.