సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (14:16 IST)

ఇదేమి ఫిష్ మార్కెట్ కాదు.. ప్రజలు చూస్తున్నారు : తమ్మినేని సీతారాం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ సభలో టీడీపీ సభ్యులు గీత దాటుతున్నారు. దీంతో సభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, విపక్షనేతలు మాట్లాడే సమయంలో అధికారపక్ష సభ్యులు నోరు మెదపడం లేదనీ, కానీ, సభానేత ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో విపక్ష సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటం భావ్యంకాదని సుతిమెత్తగా హెచ్చరించారు. 
 
పైగా, సభ ఆర్డర్ తప్పుతుంటే తాను చూస్తూ మిన్నకుండిపోవడానికి ఇదేమి ఫిష్ మార్కెట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభానేత, విపక్ష నేతలు మాట్లాడే సమయంలో ఏ ఒక్క సభ్యుడు అడ్డు తగలవద్దని కోరారు. సభను తాను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 
 
అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. సున్నా వడ్డీపై నిన్న జరిగిన చర్చలో తమపై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకే నోటీసు ఇస్తున్నామని టీడీపీ తెలిపింది. అసత్యాలు మాట్లాడి, సభను పక్కదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. సున్నా వడ్డీపై గురువారం జరిగిన చర్చపై శుక్రవారం సమావేశాల్లో కూడా టీడీపీ చర్చను ప్రారంభించింది. మరోవైపు, సున్నా వడ్డీపై చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.