బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 6 జనవరి 2022 (14:49 IST)

బలహీన వర్గాలకు చెందిన ప్రధాని మోదీని అవమానించారు

భారత ప్రధానిని పంజాబ్ గెడ్డపై అవమానకర రీతిలో పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింద‌ని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కాంగ్రెస్ కు రాజ్యాంగం అంటే గౌరవం లేద‌ని, బలహీనవర్గాలకు చెందిన వారంటే అస్సలు గిట్టద‌న్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఓబిసి మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో డైరీని సోము వీర్రాజు ఆవిష్కరించారు.
 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన నరేంద్రమోదీ అవినీతిరహిత పరిపాలన అందిస్తూంటే, కాంగ్రెస్ ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా వ్యవహరిస్తోంద‌ని, ఇది రాజ్యాంగ విరుద్దమన్నారు. నరేంద్రమోదీ ప్రజారంజక పాలన అందిస్తుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులకు నచ్చడం లేదన్నారు. నిమ్నవర్గానికి చెందిన ప్రధాని కాబట్టే, ఆయన పర్యటనను నిరోధించార‌ని, నెహ్రు కాలం నుండి కాంగ్రెస్ రాచరికపు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంద‌న్నారు. అందులో భాగంగానే ఫరూక్ అభ్ధుల్లా  కాశ్మీర్ కు ముఖ్యమంత్రిని చేశార‌ని, కాంగ్రెస్ ఫ్యూడల్ సైకాలజీతో వ్యవహరించడం వల్లనే  దేశానికి సమస్యలు వస్తున్నాయన్నారు. 
 
 
పంజాబ్ ప్రభుత్వ వ్యవహార శైలిని  ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా  ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉద్యమిస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ అని, త‌మ‌కు అన్నివర్గాలు సమానమే అన్నారు. ఒక వర్గాన్నిఇబ్బందిపెట్టడానికి రాజధాని తరలింపు అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ తెరపైకి తెస్తోందన్నారు. జాతీయ రహదారుల విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల మాటలు చూస్తే ఈ ప్రభుత్వ గుడ్డి వైఖరి అర్ధం అవుతోంద‌ని చెప్పారు.