1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (19:01 IST)

ప్రధాని పంజాబ్ పర్యటన రద్దు.. ఎందుకో తెలుసా?

PM Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన రద్దు అయ్యింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. 42,750 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రధాని తన పర్యటన సందర్భంగా ప్రారంభించాల్సి ఉంది. ఢిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్ వే, అమృత్‌సర్-ఉనా రహదారి విస్తరణ, ముకేరియన్-తల్వారా కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ పనులను ప్రారంభించాల్సి ఉంది.
 
అయితే ప్రధానీ పంజాబ్ చేరుకున్నారు. కానీ అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా తన ఎన్నికల సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆయనకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. ఆయన కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. 20 నిమిషాల పాటు ప్రధాని ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అది కూడా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్‌లో చిక్కుకున్నందు వల్ల ఎటూ కదల్లేని స్థితిని ఎదుర్కొన్నారాయన. ట్రాఫిక్ క్లియర్ చేసేంత వరకూ కారులో గడిపారు.
 
కాగా- ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనికి గల కారణాలను సమర్పించాల్సిందిగా పంజాబ్ హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పంజాబ్ ప్రభుత్వం కూడా దీన్ని భద్రతలోపంగా గుర్తించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. డీజీపీ నుంచి నివేదికను కోరింది. ఈ ఘటన పట్ల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు. 
 
కాగా, ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌ చిక్కుకోవడం పట్ల ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ స్పందించారు. రాష్ట్ర పోలీసుల లోపాలు ఏమీ లేవని అన్నారు. కాగా- ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాణాలతో తిరిగి వెళ్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీకి తెలియజేయాలన్నారు.