సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (17:34 IST)

బండి సంజయ్‌కు - జేపీ నడ్డాకు తేడాలేదు : మంత్రి కేటీఆర్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జేపీ నడ్డా అంటే ఓ పెద్ద మనిషి అనుకున్నాం. కానీ, ఆయనకు తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏమాత్రం తేడాలేదంటూ ఘాటైన విమర్శలు చేశారు. 
 
మంగళవారం హైదరాబాద్ నగరానికి వచ్చిన జేపీ నడ్డా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వీటికి మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సర్కారు చేసింది ఏమీలేదన్నారు. అంతా చిల్లర రాజకీయం. దేశంలో ఏదో రూపంలో చిచ్చుపెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బీజేపీ ఆలోచనగా ఉందని ఆరోపించారు. 
 
కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ, సీబీఐ, ఐటీలేనని అన్నారు. అలాగే హస్తినలోని ఓ వర్గం మీడియా మోడీయాగా మారిందంటూ సెటైర్లు వేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీని పంజాబ్ రైతులు అడ్డుకున్నారు. తమ గడ్డపై అడుగుపెట్టనీయకుండా ఆందోళనకు దిగారు. అందుకే ప్రధాని మోడీ బుధవారం తలపెట్టిన పంజాబ్ రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారనీ, కానీ తన పర్యటన రద్దుకు భద్రతా వైఫల్యాన్ని కారణంగా బయటకు ప్రచారం చేస్తున్నారన్నారు. 
 
నిజానికి ఇలాంటి దౌర్భాగ్యస్థితి దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రికి ఎదురుకాలేదన్నారు. సిగ్గులేని.. నీతిలేని ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అంటూ మండిపడ్డారు. 
 
కేంద్రంలో ఐదు లక్షల ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని భర్తీ చేయరు కానీ, రాష్ట్రంలో ఉద్యోగల భర్తీ చేయాలని దొంగ దీక్షలు చేస్తారు. జేపీ నడ్డాది.. కేరాఫ్ ఎర్రగడ్డ అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.