గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 మే 2021 (13:33 IST)

ఏపీ బడ్జెట్: విద్యా రంగానికి రూ.24,624 కోట్లు కేటాయింపు

అమరావతి: పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతారు. రాష్ట్ర విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి సంబంధించిన కేటాయింపులతో ఈ విషయం మరోమారు స్పష్టమైంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగా.. పాఠశాలల్లో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు, జగనన్న విద్యా కానుకు కోసం రూ.750 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించారు. కాగా గత బడ్జెట్‌లో ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. విద్యా శాఖ, అంగన్‌వాడీ కేంద్రాల (వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లు)లో నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్ బుధ‌వారం సమీక్ష నిర్వ‌హించిన విష‌యం విధిత‌మె.

ఈ స‌మావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.రామకృష్ణ, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, సర్వశిక్షా అభియాన్‌ సలహాదారు ఎ.మురళి, విద్యా శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.