శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (20:38 IST)

ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు.. అవేంటో తెలుసా? ఫుల్ డిటైల్స్ ఇక్కడ

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) గురువారం వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లో ఉన్న ప్రచార విభాగం ఎదురుగా పచ్చిక ఆవరణలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయకల్లాం, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
 
ఇవే ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాలు:
 
1. నవరత్నాలు అమల్లో భాగంగా వైయస్సార్‌ చేయూతకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
రాష్ట్రంలోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేల ఆర్థిక సహాయం అందజేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ. 18,150ల చొప్పున నాలుగేళ్ళ పాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయనుంది.24 నుంచి 25 లక్షలమంది లబ్ధిదారులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థికసాయం మహిళలు పురోగతి సాధించేందుకు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 
 
2. ‘జగనన్న తోడు’ కింద చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలకు కేబినెట్‌ ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం “జగనన్నతోడు” పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చిరువ్యాపారులు, తోపుడుబళ్లు, సంప్రదాయ హస్తకళలు, బడ్డీ కొట్లు, నెత్తిమీద బుట్టపెట్టుకుని అమ్మేవాళ్లకు ఏడాదికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలను బ్యాంకుల ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

అక్టోబర్‌లో జగనన్న తోడు పథకం ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 9 లక్షలమందికి పైగా లబ్ధిదారులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం కింద ఏడాదికి దాదాపు రూ. 56 కోట్లు వడ్డీని ప్రభుత్వం భరించనుంది. ఆర్థికసాయం అందించడం ద్వారా చిరువ్యాపారులకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
3. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కు కేబినెట్ ఆమోదం
ఇప్పుడిస్తున్న దానికంటే మైదాన, గిరిజన ప్రాంతాల్లో మరియు పేదలైన ప్రతి ఒక్క గర్భిణి, చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాలకోసం ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన అని మంత్రి వెల్లడించారు.

ఈ పథకానికి మంత్రిమండలి అంగీకారం తెలిపింది. ఈ ఏడాది గర్భవతులు, తల్లులు, పిల్లల పౌష్టికాహారం కోసం 1863.11 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనుంది. 2018–19లో గత ప్రభుత్వం రూ. 762 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. 2019–20లో రూ.1076 కోట్లు ఖర్చుచేశామని మంత్రి తెలిపారు.  
 
4. ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు కేబినెట్‌ అంగీకారం
హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో (జీవో నంబర్ 90) చేసిన మార్పులు చేర్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లబ్దిదారులకు ఇళ్లు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు నివాసం ఉన్న తర్వాతనే అమ్ముకునేలా మార్పులు చేర్పులు చేశామని మంత్రి తెలిపారు.
 
5. గ్రేహౌండ్స్‌ శిక్షణా స్థలంకోసం 385 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదముద్ర
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్ శిక్షణ స్థలం కోసం 385 ఎకరాలు ప్రభుత్వం ఉచితంగా కేటాయించేందుకు కేబినెట్ నిర్ణయించింది.

ఇప్పటికే ఆ స్థలంలో ఎటువంటి ఆధారాలు లేకున్నా పంట సాగు చేసుకుంటున్నవారికి 10.88 కోట్ల పరిహారం  ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నక్సల్స్ ఏరివేత, నిలువరించేందుకు సమర్థవంతమైన తర్ఫీదు కోసం  విశాఖపట్నం జిల్లాలో గ్రేహౌండ్స్ కు ఈ స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
 
6. ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఆమోదమద్ర
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కురుపాం మండలంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 153 కోట్లు ఖర్చు చేయనుంది.  ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న కళాశాల నాలుగవదిగా లిస్ట్ లో చేరబోతోంది. తద్వారా ఇందులో 77 గిరిజన మండలాల్లోని గిరిజనులకు రిజర్వేషన్ అవకాశం కల్పించనున్నారు, మిగితాది అందరికీ వర్తించేటట్లు కేబినెట్ ఆమోదించింది. 
 
7. ఏపీ ఉన్నత విద్యాశాఖ ద్వారా తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ సొసైటీ కింద తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తిరుపతిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని మంత్రి తెలిపారు.
 
8. జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్‌ మెంట్‌ డబ్బును నేరుగా తల్లుల అకౌంట్ లోకి జమచేయనున్న ప్రభుత్వం
జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్‌ మెంట్‌ డబ్బును నాలుగు దఫాలుగా నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి త్రైమాసికం పూర్తికాగానే ఫీజు రియింబర్స్‌ మెంట్‌ డబ్బును తల్లులు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది.

కాలేజీల్లో వసతులు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న చదువులపై తల్లిదండ్రుల సమీక్ష, పరిశీలనకు ఈ విధానం ఉపకరిస్తున్నందని ప్రభుత్వం భావించింది. ఈ నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు 2018-19 విద్యాసంవత్సరంలో రూ.1291 కోట్లు, 2019-2020 విద్యాసంవత్సరానికిగాను రూ.3786 కోట్లు కలిపి మొత్తం రూ.5వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించడం జరిగిందన్నారు.
 
9. గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదేవిదంగా ఏలూరు, ఒంగోలు, తిరుపతిల్లోని నర్సింగ్ కాలేజీల్లో మరో 144 టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం దృష్టిపెట్టింది.
 
10. రైతులకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
రైతులకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు 8 వేల కోట్ల నుంచి 9 వేలకోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి తెలిపారు.

ఈ క్రమంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా 10 వేల మెగావాట్ల విద్యుత్ ను అందించి భారాన్ని తగ్గించుకుంటామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, పగటిపూట కరెంటు సరఫరా స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ హామీని నిలబెట్టుకుంటామని మంత్రి తెలిపారు. కేబినెట్ దీనికి పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేసిందన్నారు.
 
11. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్‌ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం
రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్‌ –1 కింద 36 నెలల్లో రూ. 3,736 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి ప్రణాళిక వేశారు. 802 ఎకరాల్లో తొలిదశ భూసేకరణకు రూ.200 కోట్ల నిధులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
12. గండికోట నిర్వాసితులను తరలించేందుకు రూ.522.85 కోట్ల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
26.85 టీఎంసీల నీటి నిల్వ కోసం ఉద్దేశించబడిన గండికోట రిజర్వాయర్ లో భాగంగా 7 గ్రామాల్లోని గండికోట నిర్వాసితులను తరలించేందుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.522 కోట్లు నిధులు విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది.
 
13. వెలిగొండ ప్రాజక్టులో ఆర్‌ అండ్‌ ఆర్‌కు రూ. 1301.56 కోట్లు, తీగలేరు, ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ భూసేకరణకోసం రూ.110 కోట్లు..మొత్తంగా రూ. 1411.56 కోట్లు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 
14.   ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పన్ను ఎగవేతలపై ప్రభుత్వం నిశిత దృష్టిసారించిందని మంత్రి తెలిపారు.  ఈ క్రమంలో సమర్థవంతమైన చర్యలకు కొత్త విభాగం ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది.

దీనిలో భాగంగా జీఎస్టీ పరిధిలోకి వచ్చే సేల్స్ అండ్ సర్వీస్ పన్నులు ఎగ్గొట్టే వారిపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక శాఖ పరిధిలో ఈ విభాగం పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ కు 55 పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 
15. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాతః కాలంలో (తెల్లవారుఝామున) తలుపులు తీసే సన్నిధి గొల్లలకు వారసత్వపు హక్కు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 
16. ఇంటిగ్రేటెడ్‌ రెన్యువల్‌ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
 
కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం అనుమతిచ్చిన ప్రాజెక్టునే ప్రస్తుత ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. గతంలో ప్రభుత్వ భూమికి ఎకరాకు రెండున్నర లక్షలు కేటాయించగా తమ ప్రభుత్వం ఎకరా భూమిని రూ. 5లక్షలు చొప్పున ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు.

ఇప్పుడు కూడా అదే సంస్థ, అదే ప్రాజెక్టు.. కానీ తాము ఎకరాకు రెట్టింపు చెల్లించడానికి సిద్ధమయ్యామని మంత్రి తెలిపారు. ఇది కాక ప్రతి మెగావాట్‌కు ప్రతి ఏటా గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఛార్జ్‌ కింద లక్ష రూపాయలు చెల్లింపునకు కంపెనీ అంగీకారం తెలిపిందన్నారు. తద్వారా ఏడాదికి రూ.32కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు.

25 ఏళ్ల తర్వాత ప్రతి మెగావాట్‌కు 2 లక్షల రూపాయలు చెల్లింపునకు అంగీకారం తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా 580 మెగావాట్లు విండ్‌ పవర్, 1680 మెగావాట్ల హైడల్ పవర్, 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేయనున్నామని మంత్రి తెలిపారు.
 
17. ఏపీ ఫైబర్‌ నెట్, చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్‌ తోఫా పథకాల్లో జరిగిన అవినీతిపై కేబినెట్‌ సబ్‌ కమిటీ  నివేదిక, సూచన మేరకు సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
 
చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక వంటి పథకాల ద్వారా రూ.158 కోట్ల అవినీతి జరిగిందని,  ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు కేబినెట్ సబ్ కమిటీ తేల్చిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలని కేబినెట్  నిర్ణయించిందన్నారు. 
 
18. 2700 నుంచి 2200 ఎకరాలకు భోగాపురం ఎయిర్‌పోర్టు కుదింపు
రివర్స్ టెండరింగ్ ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టులో లో 500 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించిందని మంత్రి తెలిపారు. కుదించిన స్థలంలోనే విమానాశ్రయ నిర్మాణానికి కంపెనీ అంగీకారం తెలిపింది. తాజా ఒప్పందం కారణంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు వచ్చిందని మంత్రి తెలిపారు. ఎకరాకు రూ. 3 కోట్లు ధర వేసుకున్నా... ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయం ఆదా చేసినట్లు మంత్రి వివరించారు.

ఈ 500 ఎకరాలను ప్రభుత్వం కమర్షియల్ గా వాడుకోనుందని తెలిపారు. ప్రభుత్వంలో అవినీతి అన్నది లేకపోతే ప్రజలకు ఎంతమేలు జరుగుతుందో పైరెండు అంశాలు నిరూపిస్తున్నాయని కేబినెట్ లో ముఖ్యమంత్రి, మంత్రులు వ్యాఖ్యానించారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు.