ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (15:34 IST)

శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం, జగన్ దుర్యోధనుడన్న వర్ల

అమరావతి : శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో మండలి రద్దు చేస్తే పరిస్థితేంటి..? మండలిలోని పార్టీ నేతలకు ఎలా న్యాయం చేయాలి..? ఇలా అన్ని విషయాలపై నిశితంగా చర్చించిన తర్వాత కేబినెట్ నిర్ణయించింది. 
 
కాగా.. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. 99 శాతం మేర మండలిని రద్దు చేసే దిశలోనే సీఎం జగన్‌ ఉన్నారని గత రెండు మూడ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. సీఆర్‌డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. 
 
శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో.. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే, శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. ఫలితంగా శాసనమండలిని జగన్‌ రద్దు చేస్తున్నారని టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
 
జగన్ దుర్యోధనుడు: టిడిపి పోలి్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
ఆనాడు మహాభారతంలో మయసభలో భంగ పడిన దుర్యోధనుడులా...  ఈనాడు శాసనమండలిలో భంగపడ్డ  ముఖ్యమంత్రి గారు... ఆనాడు మయసభను ధ్వంసం చేసి ఆయన కురుక్షేత్ర సంగ్రామంలో సర్వ నాశనమైతే... ఈనాడు మండలిని రద్దు చేసి, ఈయన  ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఆనాటి దుర్యోధనుడి గతే ఈనాటి ముఖ్యమంత్రికి తప్పదని గ్రహించాలి అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.