1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మే 2024 (16:23 IST)

ఓట్ల లెక్కింపు రోజున చిన్న అలజడి సృష్టించినా అరెస్టు చేయండి : మీనా ఆదేశం

mukesh kumar meena
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదీన జరుగనుంది. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతను కల్పిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు.
 
ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్‌ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
 
మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీమ్ అస్మితో కలిసి ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రం భద్రతను పరిశీలించామని మీనా తెలిపారు. 
 
ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీఆర్‌పీఎఫ్‌ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్‌ పికెటింగ్ ఉంటుందన్నారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.