శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 14 నవంబరు 2017 (18:27 IST)

కష్టపడి సంపాదించిన ఆదాయం అంతా హైదరాబాద్‌లో ఉంది... ఏపీ సీఎం

అమరావతి: ప్రజలకు ఇబ్బంది కలిగించనంతవరకు ఉద్యోగులకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏపీ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీస్ వారికి 50 శాతం రాయితీపై ఏర్పాటు చేసిన

అమరావతి: ప్రజలకు ఇబ్బంది కలిగించనంతవరకు ఉద్యోగులకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏపీ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీస్ వారికి 50 శాతం రాయితీపై ఏర్పాటు చేసిన ఫలహారశాలను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పైసా డబ్బులు ఇవ్వకుండా రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలిచ్చిన రైతులే స్ఫూర్తి అన్నారు. 
 
హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు వదులుకొని ఇక్కడికి రావడం కష్టమని, రాష్ట్రం బాగుపడాలన్న ఉద్దేశంతో రెండో ఆలోచన లేకుండా ఇక్కడకు వచ్చిన ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. ఏమీ వసతులు లేని ప్రాంతంలో అన్నీ సమకూర్చుకుంటున్నామని, సచివాలయం మొత్తానికి ఏసీ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మనసుపెట్టి పని చేసే వాతావరణం కల్పించామని, అన్ని డైరెక్టరేట్ల్‌లకు, కమిషనరేట్‌లకు కూడా ఏసీ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. 
 
ఉద్యోగినులతోసహా అందరు ఉద్యోగుల ఫిట్నెస్ కోసం జిమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిని ఉపయోగించుకొని ఆస్పత్రులకు వెళ్లకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని సలహా ఇచ్చారు. ఉద్యోగుల కోసం, వారికి కావలసిన సౌకర్యాల కోసం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ పోరాడి సాధిస్తారని ప్రశంసించారు. కష్టపడి సంపాదించిన ఆదాయం అంతా హైదరాబాద్‌లో ఉందని, కొత్త రాష్ట్రంలో సమస్యలు వస్తుంటాయని, వాటిని అందరూ కలసి ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు. ఇక్కడికి వచ్చినందుకు ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచామని, కుటుంబానికి దూరంగా ఉండేవారికి ఉచిత వసతి కల్పించామని, డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేశామని వివరించారు. 
 
ఉద్యోగులకు, జర్నలిస్టులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడానికి రూ.10, 12 లక్షలే కాదు రూ.20 లక్షలైనా ఇస్తామన్నారు. ఆహారం బాగోకపోయినా, రుచిగా లేకపోయినా ఏవిధమైన ఫిర్యాదు వచ్చినా మీరే బాధ్యత వహించవలసి ఉంటుందని క్యాంటిన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌ని ఉద్దేశించి సీఎం నవ్వుతూ హెచ్చరించారు. 
 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఈ నెల 15వ తేదీ బుధవారం నుంచి 50 శాతం రాయితీపై భోజన వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. 2700 పేర్లు కంప్యూటర్లో ఎంటర్ చేశామని, ప్రతి ఒక్కరికి రోజుకు రెండుసార్లు టిఫిన్, ఒకసారి భోజనం అందజేస్తామని, అంతకుమించితే కంప్యూటర్ తిరస్కరిస్తుందని వివరించారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, ఉద్యోగుల సంఘ నేతలు వెంకటసుబ్బయ్య, సీహెచ్‌వై యాదవ్ తదితరులు పాల్గొన్నారు.