గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

హూ కిల్డ్ బాబాయ్? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుంది : సీఎం చంద్రబాబు

chandrababu
రాష్ట్ర వ్యాప్తంగా మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్న హూ కిల్డ్ బాబాయ్? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పటివరకు వేచి చూడాలని ఆయన కోరారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశామన్నారు. పోలీసులు కూడా అలాంటి నేరస్తుడికి సహకరించారని మండిపడ్డారు. ఆ నేరస్తుడి పాలనలో సీబీఐ వాళ్లు కూడా అరెస్టు చేయలేక వెనక్కి వచ్చారని గుర్తుచేశారు. కోడికత్తి డ్రామా చూశాం, గులకరాయి డ్రామా చూశాం... కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ, గులకరాయి డ్రామా పనిచేయలేదని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
'ఒక వ్యక్తి ధనదాహం వల్ల ఎక్కడ చూసినా అవినీతి నెలకొంది. ధనదాహంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేశారు. అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడ్డారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఒక్క మైనింగ్‌లోనే రూ.20 వేల కోట్లు దోచుకున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అవినీతి డబ్బును రాష్ట్రమంతా పంచారు. 
 
అసమర్థ నిర్ణయాలతో రాష్ట్రం ధ్వంసమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధికి దూరం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారు. రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారో తెలియడంలేదు. ప్యాలెస్‌ను టూరిజం కోసం ఇవ్వాలని కొందరు అంటున్నారు. నాడు ప్రజావేదిక కూల్చారు... ఆ శకలాలను కూడా తొలగించలేదు.
 
పులివెందుల మాదిరి రాష్ట్రాన్ని తయారుచేద్దామనుకున్నారు. పైశాచిక ఘటనలకు పాల్పడతారు. తిరిగి ఆ నేరం మనపైనే వేస్తారు. బాధితులనే నిందితులుగా చేసిన ఘనత వైసీపీది. వివేకా హత్య కేసు ఎన్ని మలుపులు తిరిగిందో చూశాం. సీబీఐ వాళ్లు కూడా అరెస్టు చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించింది. హూ కిల్డ్ బాబాయ్? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుంది అని ఆయన పేర్కొన్నారు.