బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (17:17 IST)

పాల సంఘాల్లో గుత్తాధిప‌త్య రాజ‌కీయం ... అందుకే జ‌గ‌న‌న్న పాల వెల్లువ‌!

కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం వైయస్‌.జగన్‌. ప్రారంభించారు. 

 
ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ, పశుసంవర్ధశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఏపీడీడీసీఎఫ్‌) ఎండీ ఎ బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ అమరేంద్రకుమార్, అమూల్‌ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న సబర్‌ కాంత మిల్క్‌ యూనియన్‌ (సబర్‌ డెయిరీ) ఎండీ డాక్టర్‌ బీ ఎం పటేల్ పాల్గొన్నారు. 

 
ఈ సంద‌ర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో 264 గ్రామాలలో ఏపీ పాలవెల్లువ ద్వారా పాలసేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామ‌ని, ఇదొక మంచి చారిత్రక ఘట్టమ‌ని చెప్పారు. ఏపీలో  పాల వెల్లువ ద్వారా రైతులకు, అక్కచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభించబోతుంద‌న్నారు. అమూల్‌ ప్రారంభించిన ఏడాదిలోనే పాలవెల్లువ స్కీం ఆరో జిల్లాలో ప్రవేశించింద‌న్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన 7 జిల్లాలలో ఉధృతంగా కదులుతుంద‌ని, మార్కెట్‌ ధరల స్థిరీకరణ నిధి పెట్టి ప్రభుత్వమే మార్కెట్‌లో  రంగ ప్రవేశం చేసింద‌ని చెప్పారు. 

 
అమూల్‌ కంపెనీ కాదు.. మనలాంటి వాళ్లు కలిసికట్టుగా ఒక్కటైతే అమూల్‌ అవుతుంది. అమూల్‌ యజమానులు ఎవరంటే మీరే... పాలు పోసే మీరే అమూల్‌లో యజమానులు. ఈ డబ్బులు కూడా వాళ్లు పెట్టుకోరు. అత్యధిక రేటు మీకిస్తారు. ఆ తర్వాత వచ్చే లాభాలను బోనస్‌గా మనకే తిరిగి పంపిణీ చేస్తారు.  వాళ్ల దగ్గరున్న ప్రాసెసింగ్‌ మరెవ్వరి దగ్గరా లేదు. ఏకంగా పాల నుంచి చాక్లెట్స్‌ చేసే స్ధాయిలోకి ఎదిగిన సంస్ధ అమూల్ అని సీఎం చెప్పారు.
 

అమూల్‌  సంస్ధ రాష్ట్రంలో  ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలలోనూ, చిత్తూరు జిల్లాలో  275 గ్రామాలలోనూ, వైయస్సార్‌ జిల్లాలో 149 గ్రామాలలోనూ, గుంటూరులో 203 గ్రామాల్లోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి ఇప్పటికే పాలసేకరణ చేస్తుంద‌న్నారు. ఆయా జిల్లాలలో 1046 గ్రామాల నుంచి పాలసేకరిస్తుండగా, 2022  సెప్టెంబరు నాటికి 17,629 గ్రామాల నుంచి పూర్తిగా పాలసేకరణకు ప్రణాళికలు చేశామ‌న్నారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఐదు జిల్లాలలో ఇప్పటివరకు 30,951 మంది మహిళా పాడిరైతుల నుంచి 168.50 లక్షల లీటర్లు పాలసేకరణ అమూల్‌ చేసింద‌ని, దాదాపు రూ.71 కోట్లు చెల్లించామ‌ని ఇది గ‌తంలో ఇత‌ర సంఘాలు ఇచ్చిన దానిక‌న్నా ప‌ది కోట్లు అదనంగా చెల్లించామ‌న్నారు.
 
 
ఉదాహరణకు చాట్రాయి మండలం సోమవరంకు చెందిన పి వెంకటనర్మమ్మ అనే సోదరి గతంలో కృష్ణా మిల్క్‌  యూనియన్‌కు పాలు పోయగా, లీటరుకు రూ.44.80 గిట్టుబాటు అయింది. అదే అమూల్‌ పాల వెల్లువ కేంద్రంలో పాలు పోయగా లీటరుకు రూ. 74.78 వచ్చాయి. అంటే లీటరు పాలపై ఆమె దాదాపు రూ.20 నుంచి రూ.30 అదనంగా సంపాదించింద‌ని సీఎం వివ‌రించారు. పాల నుంచి నేరుగా ఏకంగా చాక్లెట్‌ తయారు చేసే ప్రాససింగ్‌ వ్యవస్ధ అమూల్ వ‌ద్ద ఉంద‌ని, అమూల్‌ దేశంలో మిల్క్‌ ప్రాససింగ్‌లో మొదటి స్ధానంలో ఉండగా, ప్రపంచంలో 8వ స్ధానంలో ఉంద‌ని పేర్కొన్నారు. లాభాపేక్ష అనేది అమూల్‌కు లేద‌ని, సంస్ధ గడించే లాభాలను కూడా సంవత్సరానికి ఒకసారి తిరిగి అక్కచెల్లెమ్మలకు వెనక్కి ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్‌లోనే ఉంద‌ని చెప్పారు. పాల బిల్లును కూడా కేవలం పదిరోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేయడం వల్ల మన అక్కచెల్లెమ్మలకు అందరికీ ఆర్ధికంగా మరింత మేలు జరుగుతుంద‌న్నారు. అంతే కాకుండా అమూల్‌ సంస్ధ నాణ్యమైన పశుదాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారు. బీఎంసీయూ, ఏఎంసీయూలలో అందుబాటులో ఉంచుతున్నార‌ని చెప్పారు. 
 

సహకార రంగ డెయిరీలలో బాగున్నవాటిలో కొన్నింటిని దురదృష్టవశాత్తూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా ఆక్రమించుకున్నార‌ని, అవి వాళ్ల ప్రయివేటు ఆస్తుల కింద మారిపోయాయ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. రెండోది ప్రభుత్వంలోని వ్యక్తులకు వాళ్లకే ప్రయివేటు డెయిరీల్లో వాటాలు ఉండటం వల్ల, ఏరోజు కూడా రాష్ట్రంలో పాలుపోసే అక్క చెల్లెమ్మలకు మంచి ధరలు ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఉండేది కాద‌న్నారు.