సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:21 IST)

కొందరు రాక్షసులతో ఒంటరిగా యుద్ధం చేస్తున్నా : సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రహిత పారదర్శకమైన పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పైగా, రాష్ట్రంలోని కొందరు రాక్షసులతో ఒంటరిగా పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ప్రజాహితమైన ఈ పాలనను ద్వేషించేవాళ్లను ఏమనాలో అర్థం కావట్లేదన్నారు. 
 
గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వలంటీర్ల సత్కార సభలో ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. డిపాజిట్లు దక్కవనే భయం ఎల్లో పార్టీ, దాని అధినేత చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని, అనుబంధంగా ఉన్న పార్టీలోనూ ఆ బాధ కనిపిస్తోందని అన్నారు. ఎల్లో మీడియాలో సైతం ఆ బాధ, ఏడ్పు స్పష్టంగా చూపిస్తు‍న్నారని చెప్పారు. 
 
గత ప్రభుత్వం దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసిందని గుర్తు చేస్తూ.. ఇప్పుడేమో వాళ్లు అబద్ధాలతో తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామన్నారు. దెయ్యాలు, రక్త పిశాచుల మాదిరి ప్రతిపక్షం - మద్దతు పార్టీలు, అనుబంధ మీడియాలు వ్యవహరిస్తున్నాయన్నారు.
 
ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్‌కు క్లాస్‌ పీకారంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి.. ఎల్లో మీడియాగానీ, దానికి అనుబంధం ఉన్నవాళ్లు ఎవరైనాగానీ ఆ టైంలో సోఫాల కిందగానీ దాక్కున్నారా? అంటూ జగన్ చమత్కరించారు. 
 
భవిష్యత్‌లో ఎవరూ ఓటు వేయరన్న భయమే వాళ్లతో అలాంటి పనులు చేయిస్తోందని అన్నారు. అసూయ మంచిది కాదని, దాని వల్ల నష్టమే తప్ప మంచి జరగదని హితవు పలికారు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని దుర్మార్గులు ఇప్పుడు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వాన్ని విమర్శించడం చోద్యంగా ఉందన్నారు. 
 
మంచి పాలన అందిస్తుంటే మరో శ్రీ లంక అవుతుందని కామెంట్లు చేస్తున్నారని, మరి వాళ్లలా వెన్నుపోట్లు పొడిస్తే అమెరికా అవుతుందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కన్నా కనివినీ ఎరుగని రేంజ్‌లో సేవ అందిస్తున్నామని, నచ్చితే అభిమానించడని, నచ్చకపోతే తనను ద్వేషించాలని పిలుపునిచ్చారు.