బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (11:52 IST)

హస్తినలో సీఎం జగన్ బిజీబిజీ... కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనలో ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన ఆ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌లతో సమావేశమయ్యారు. తర్వాత పౌర విమానయనా శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. 
 
రెండో రోజైన మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ముందుగా మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ డగ్కరీతో భేటీకాగా, ఉదయం 11 గంటల సమయంలో క్రీడాశాఖామంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అయ్యారు. 
 
అలాగే, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశంకానున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారు. 
 
మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో ఏపీలో రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా తీర ప్రాంతం వెంబడి నాలుగు లేన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. అలాగే, విశాఖ - భోగాపురం జాతీయ రహదారి నిర్మాణంపై చర్చించారు. 
 
ఇకపోతే, విజయవాడ తూర్పు హైవే ఏర్పాటుపై కూడా మంత్రి గడ్కరీతో సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే, ఏపీలోని పలు పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్త చేయాలని కోరారు.