గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (12:25 IST)

కడప జిల్లాలో వినాయకుడి విగ్రహం మాయం - ఆలయ నిర్మాణానికి భూమిపూజ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ‌రుస‌గా దేవాల‌యాల‌పై దాడుల ఘ‌ట‌న‌లు జరుగుతున్నాయి. ఇవి రాష్ట్రంలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఆ ఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ‌ రాముడి విగ్రహాన్ని కొంద‌రు ధ్వంసం చేసిన త‌ర్వాత క‌ల‌క‌లం చెల‌రేగిన‌ప్ప‌టికీ అనంత‌రం మ‌రికొన్ని విగ్ర‌హాలు ధ్వంసమ‌య్యాయి.
 
ఇప్పుడు ఓ ఆల‌యంలో దేవుడి విగ్ర‌హాన్ని పూర్తిగా మాయం చేశారు.  కడప జిల్లాలోని వేముల మండలం చాగలేరు గ్రామంలో వినాయక విగ్రహాన్ని గ‌త‌ రాత్రి దుండగులు ఎత్తుకెళ్లిన‌ట్లు ఈ రోజు ఉద‌యం గ్రామ‌స్థులు గుర్తించారు. అనంత‌రం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్క‌డి ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించి ద‌ర్యాప్తు ప్రారంభించారు.
 
మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో కూల్చివేసిన 9 ఆలయాలను పునర్నిర్మించే పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ ఉదయం 11.01 గంటలకు కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.  
 
కాగా, రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో పునర్నిర్మిస్తున్న ఆలయాల వివరాలను పరిశీలిస్తే, సీతమ్మ పాదాలు, రాహుకేతు ఆలయం, బొడ్డు బొమ్మశనైశ్చర ఆలయం, దుర్గగుడి మెట్ల వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, సీతారామ లక్షణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, సీతమ్మ పాదాలకు సమీపంలో దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న వీరబాబు ఆలయం, కనకదుర్గ నగర్ లో ఉన్న శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల ఉన్నాయి.