బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:20 IST)

కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు వివిధ సంస్థల నుండి రూ.57 కోట్ల సాయo

కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుండి దాదాపు రూ.57 కోట్ల మేర సాయమందని ఎపి కొవిడ్ కమాండ్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడించారు. మరో రు.25.2 కోట్ల మేర సాయం వివిధ దశల్లో వుంది. కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు పలు సంస్థలు, వ్యక్తులు ఆపన్న హస్తాన్ని అందజేయడం అభినందనీయం.

బయోఫోర్, లుపిస్, ఇండియా బుల్స్, నాట్కో ట్రస్ట్ వంటి సంస్థల నుండి దాదాపు రూ.1.6 కోట్ల  విలువైన ఔషధాలందాయి. నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థతో కలిసి 10bedICU.org ప్రతి జిల్లా ఏరియా ఆస్పత్రిలో 34×10 పడకల ఐసియులను ఏర్పాటు చేస్తోంది. ఆరు జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో ఎసిటి ఫౌండేషన్ సంస్థ 500 ఎల్పిఎం  ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మిస్తోంది. మాస్టర్ కార్డ్, మాడ్యులస్ హౌసింగ్ సంస్థలు మొబైల్ ఆస్పత్రి యూనిట్లను అందజేశాయి. ఎన్టీపిసి రూ.1.5 కోట్ల విలువైన బెడ్లు, వైద్య పరికరాల్ని సమకూరుస్తోంది. అసిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థ చిన్నారుల  వెంటిలేటర్ల కోసం 10 లక్షల డాలర్లను అందజేసింది.

అమెరికన్-ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ సంస్థ 50 లక్షల ఎన్ 95 మాస్కుల్ని , లక్ష పిపిఇ కిట్లను అందజేసింది. మహింద్రా అండ్ మహింద్రా సంస్థ పిఎస్ఎ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అంబులెన్స్ లను అందజేసింది. మాడ్యులస్ హౌసింగ్ సంస్థ తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలలో 100 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రులను నిర్మిస్తోంది.
 
వివిధ సంస్థల నుండి ఇప్పటి వరకూ 3,100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 519 ఆక్సిజన్ సిలిండర్లు ప్రభుత్వానికందాయి. మరో వెయ్యికి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేయనున్నారు. ఎఐఎఫ్ సంస్థ 500 ఎల్పిఎం ఆక్సిజన్ ప్లాంట్లను ప్రకాశం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలకు అందజేసిందని ఎపి కొవిడ్ కమాండ్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడించారు.