సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:03 IST)

ప్రయాణికుల అనుమతిపై స్పష్టతనిచ్చిన అమెరికా

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ బంద్ అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో దశల వారీగా ఈ సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై ఓ క్లారిటీ ఇచ్చింది. కరోనా టీకా పూర్తి స్థాయి(రెండు డోసులు)లో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి రావొచ్చంటూ పేర్కొంది.
 
ఈ నిబంధనకు లోబడి భారత్‌ సహా 33 దేశాల వారు తమ దేశంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. అయితే, మన దేశంలో తయారైన టీకాల్లో కొవిషీల్డ్‌ తీసుకున్న వారినే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాత శ్వేతసౌథం మరో ప్రకటన చేస్తూ... ఏ టీకా ఆమోదయోగ్యమో తుది నిర్ణయం తీసుకొనేది తమ దేశ ‘వ్యాధుల నియంత్రణ కేంద్రం’ (సీడీసీ) మాత్రమేనని పేర్కొంది. 
 
డబ్ల్యూహెచ్‌వో ఇప్పటివరకు ఏడు టీకాలను మాత్రమే గుర్తించింది. వాటిలో మోడెర్నా, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్‌(ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ఫార్ములా), చైనాకు చెందిన సినోఫార్మ్‌, సినోవాక్‌ టీకాలు ఉన్నాయి. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిపరిచిన కొవాగ్జిన్‌ టీకాకు ఈ నెలలో డబ్ల్యూహెచ్‌వో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అమెరికాకు కోవిషీల్డ్ తీసుకున్న భారతీయులు మాత్రమే వెళ్లేందుకు వీలుంది.