ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యానాధ్ దాస్
ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ( జలవనరులు ) ఆదిత్యానాధ్ దాస్ నియమితులు కానున్నారు. ఈ నెలాఖరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ విరమణ చేయనున్న ఆదిత్యానాధ్ దాస్ సేవలను ప్రభుత్వం ఈ రూపంలో సద్వినియోగం చేసుకోవాలని భావించినట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి దాస్ ను సీ.ఎస్.గా మరో మూడు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ, అందుకు ఆయన ఉత్సాహం చూపించలేదు.
సీనియర్ అధికారులు మరికొందరికి సిఎస్ గా సేవలు చేసే అవకాశం లభించాలన్న ఆలోచనతో దాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు పది సంవత్సరాలకు పైగా జలవనరుల శాఖ ను పర్యవేక్షించిన దాస్ సేవలను ప్రభుత్వం మరో రూపంలో సద్వినియోగం చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేసిన తదుపరి అక్టోబర్ మొదటి వారం లో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉంది.
తానొవ్వక, నొప్పించక అన్న తరహాలో రాజ్యాంగ పరిధులకు లోబడి వ్యవహరించిన దాస్ పనితీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండగా, సిఎస్ గా ఆయన తొమ్మిది నెలల పాటు పదవిలో ఉన్నట్లు అవుతుంది. దాస్ స్థానాన్ని 1985 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ భర్తీ చేయనున్నారు.