1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (12:59 IST)

సీఎం జగన్‌కు ఆంధ్రా - తెలంగాణ అనే తేడాలుండవ్ : డిప్యూటీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడాలు ఉండవని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే, జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. 
 
శనివారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదం పెట్టేందుకు ప్రయత్నించవద్దని ఆయన హితవు పలికారు. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు, మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. 
 
ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదానికి టీడీపీ అధినేత చంద్రబాబే ముఖ్యకారణమన్నారు.  నీటి వివాదంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నారాయణ స్వామి ప్రశ్నించారు. రాష్ట్రంలో 31.50 లక్షల మంది పేద ప్రజలకు ప్రభుత్వం తరుపున స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కూడా కట్టిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
 
వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంద‌రు వ్యాఖ్యలు చేస్తుండ‌డం స‌రికాద‌ని అన్నారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం కొన‌సాగుతున్నప్పటికీ చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయ‌న నిల‌దీశారు. 
 
ఈ విష‌యంపై చంద్రబాబు నాయుడిని మీడియా అడ‌గాల‌ని ఆయ‌న సూచించారు. జ‌గ‌న్‌కు ఆంధ్ర, తెలంగాణ అంటూ తేడాలు ఏమీ లేవ‌ని చెప్పారు. అంద‌రం తెలుగువారమేన‌ని, అంద‌రం ఐక్యంగా ఉండాల‌న్నదే జగన్ అభిమతమని నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు.