గుర్ల గ్రామంలో డయేరియా.. పర్యటించనున్న డిప్యూటీ సీఎం
ఏపీలోని విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో పవన్ ఆ గ్రామానికి వెళ్లి స్థానిక పరిస్థితులపై అదికారులతో సమీక్షిస్తారు. గ్రామంలోని పరిస్థఇతులను స్వయంగా పరిశీలించనున్నారు.
గత కొన్ని రోజులుగా విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైన గుర్ల గ్రామంలో డయేరియా విజృంభిస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఒక్క రోజులోనే నలుగురు మృతి చెందడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలోని పరిస్థితులపై అధికారుల ద్వారా ఆరా తీశారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిస్థితులను సమీక్షించనున్నారు.
మరోవైపు, ఈ మరణాలు సహజ మరణాలు కావని, ప్రభుత్వం అలసత్వం వల్ల సంభవించిన మరణాలు అని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
గ్రామంలో పారిశుద్ధ్యం దిగజారిందని, తాగునీటి సరఫరా సరిగా లేదని అందుకే డయేరియా ప్రబలిందని విమర్శించారు. గతంలో ఎపుడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆరోపించారు. కాగా, ఆదివారం ఆయన గుర్ల గ్రామంలో పర్యటించారు.