మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (14:38 IST)

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో జనసేన గల్లంతు... మరీ ఇంత ఘోరమా?

ఆంధ‌్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం ఖాయమని మెజారిటీ జాతీయ ఛానెళ్లు, సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌‌‌ అంచనా వేశాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఊహించినదానికంటే అత్యధిక స్థానాలు వైసీపీ ఖాతాలోకి రాబోతున్నాయని ఘోషించాయి. ఏపీకి కాబోయే సీఎం జగన్‌ అంటూ అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌‌ తేల్చేశాయి. అదేసమయంలో అధికార టీడీపీకి కేవలం 40 నుంచి 60 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. 
 
ఇంతవరకుబాగానే వుందిగానీ, ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ తుఫాను సృష్టిస్తానన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అసలు సోయలోనే లేకుండా పోయింది. కనీసం రెండు అంకెల స్కోరును దాటుకునే అవకాశమే లేదని తేల్చేశాయి. పైగా, పవన్ ఒక్కరే గెలిచే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించాయి. మొత్తానికి చంద్రబాబు భయపడినట్టే, జగన్‌ ధీమాకు తగినట్టుగానే, పవన్‌ మౌనానికి అనుగుణంగానే మెజారిటీ ఛానెళ్ల ఎగ్జిట్‌పోల్స్ అంచనాలున్నాయి. 
 
ఏపీలో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన జరిగింది. మొత్తం 45 రోజుల విరామం, రోజురోజుకు పెరుగుతున్న అంచనాలు, నరాలు తెగే ఉత్కంఠ, ఊహాగానాలు, సోషల్ మీడియా సర్వేలు, బెట్టింగ్ ట్రెండ్స్, ఇలా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారోనన్న క్యూరియాసిటీ ఏపీ జనాలను, ముఖ్యంగా పార్టీల నాయకులను కంటి మీద కునుకులేకుండా చేశాయి. 
 
వాటిని కాస్తోకూస్తో చల్లార్చే ఎగ్జిట్‌పోల్స్‌ కోసం అందరూ ఎదురుచూశారు. ఆ అంచనాలురానే వచ్చాయి. ఆంధ‌్రప్రదేశ్‌ అసెంబ్లీ సమరంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విజయఢంకా మోగిస్తుందని, మెజారిటీ సర్వేలు తేల్చాయి. అయితే, వాస్తవ ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెల్లడికానున్నాయి.