సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తెలుగుదేశం పార్టీ శతాధిక నేత, మాజీ మంత్రి వెంకట్రావు ఇకలేరు

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. ఆయన వయసు 102 సంవత్సరాలు. సోమవారం వేకువజామున కన్నుమూశారు. గత 2004 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన సొంతూరు గుంటూరు జిల్లా వేమూరి. ఈయన భార్య మంగమ్మ గత యేడాది మృతి చెందారు. కాగా, మాజీ మంత్రి వెంకట్రావు మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. వేమూరి నుంచి మరోమారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1978-80 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా పని చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఈయన.. 1995లో గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశారు. అలాంటి సీనియర్ నేత సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.