మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (17:24 IST)

ఆస్తులు అప్పగించని ఎయిడెడ్ పాఠశాలలపై కక్షసాధింపు

బడిలో ఉండాల్సిన విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బజారున పడేశార‌ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విమ‌ర్శించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వ సహకారాన్నిరద్దు చేయడం పేద విద్యార్థులకు అందించే విద్యకు గొడ్డలిపెట్టుగా మారింద‌న్నారు.  విద్యార్థుల జీవితాలతో పాలకులు ఆడుకోవడం మంచిది కాద‌ని, దశాబ్దాలుగా పేద విద్యార్థులకు ప్రభుత్వ సహకారంతో విద్యను అందించే ఎయిడెడ్ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేయద్ద‌న్నారు.
 
 
ఎయిడెడ్ విద్యా సంస్థలను విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో.42ను రద్దు చేయాల‌ని చంద్ర‌బాబు డిమాండు చేశారు. ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల భూములు, విద్యా సంస్థలు, విద్యార్ధుల భవిష్యత్ ను నాశనం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చాన‌ని ప్ర‌శ్నించారు. కోవిడ్ కారణంగా రెండు నెలలు ఆలస్యంగా విద్యాసంవత్సరం ప్రారంభమై ఆందోళన చెందుతుంటే, ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం విద్యార్థులను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నార‌న్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మధ్యలో ఉండగా.. ప్రభుత్వం విలీనం నిర్ణయం చేయడం విద్యార్థుల భవిష్యత్ ను అంధకారం చేయడమే. ప్రభుత్వ సాయాన్ని నిలిపేయడం వల్ల ఆ భారం పేద విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫీజులు కట్టలేక అర్థాంతరంగా చదువులు నిలిచిపోయే ప్రమాదం వుంద‌ని చెప్పారు. 
 

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను, సిబ్బంది జీవితాలను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాద‌ని, ఒకటిన్నర శతాబ్దకాలంగా కొనసాగుతున్న ఎయిడెడ్ వ్యవస్థను ఎందుకు నీరుగార్చుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని ఎయిడెడ్ వ్యవస్థను కొనసాగించాలి. అమ్మఒడి ఎవరు అడిగారు.. మా బడులు మాకు కావాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థుల విన్నపాలను అర్థం చేసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు, విద్యార్థుల పక్షాన పెద్దఎత్తున పోరాటం తప్పద‌న్నారు.