జాతీయ విద్యా విధానం 2020తో ఉన్నత విద్యకు జవసత్వాలు : ఏపీ గవర్నర్
ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలను తీర్చుతూ భారతీయ ఉన్నత విద్యావ్యవస్థను రూపు రేఖలను మార్చగల సామర్థ్యం జాతీయ విద్యా విధానం 2020 కలిగి ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. భారత విశ్వవిద్యాలయాల సంఘం ఏర్పాటు చేసిన “సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2020-21”కు గవర్నర్ ముఖ్యఅతిధిగా హజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ మోడ్‌లో బుధవారం ఈ సదస్సు జరుగగా విజయవాడ రాజ్ భవన్ నుండి బిశ్వభూషణ్ కీలకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 34 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత వినూత్నమైన అభ్యాస-కేంద్రీకృత జాతీయ విద్యా విధానం ఎన్ఈపి వల్ల సాద్యమైందన్నారు. మానవ హక్కుల పట్ల నిబద్ధత, జ్ఞానం, నైపుణ్యాలు, విలువలను అభివృద్ధి చేయడానికి ఈ విధానం సంకల్పించిందన్నారు.
ఇది అభివృద్ధితో కూడిన నిజమైన ప్రపంచ విద్యను ప్రతిబింబిస్తుందని, దీని వ్యూహాత్మక అమలు సవాలుతో కూడుకున్నదన్నారు. మెరుగైన ఉపాధి అవకాశాల సాధనలో యువత నైపుణ్యాలను మెరుగుపర్చడానికి నూతన విధానం ఉపయిక్తమని గవర్నర్ స్పష్టం చేసారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ భారతీయ ఉన్నత విద్యా సంస్థల యొక్క ప్రధాన సంస్థగా ఉండగా, భారత ప్రభుత్వానికి విధాన సలహాలను అందించటమే కాక, భారతీయ విశ్వవిద్యాలయాల ప్రతినిధి సంస్థగా పనిచేస్తుంది. సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్స్ సదస్సును గీతం విశ్వవిద్యాలయం సమన్వయం చేసింది. ఈ సందర్భంగా భారత విశ్వవిద్యాలయాల సంఘం తీసుకువచ్చిన యూనివర్శిటీ న్యూస్ పత్రిక ప్రత్యేక సంచికను గవర్నర్ ఆవిష్కరించారు.