శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 28 మార్చి 2020 (16:13 IST)

కరోనా నివారణకు ఇ-మెయిల్ ద్వారా విద్యార్థి లోకానికి పిలుపునివ్వాలన్న గవర్నర్

విశ్వ విద్యాలయ విద్యార్థులు కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నిబంధనల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ కుటుంబ సభ్యులను కూడా ఆదిశగా ప్రేరేపించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అచార్య హేమ చంద్రారెడ్డి, ఇతర అధికారులతో విజయవాడ రాజ్ భవన్ వేదికగా శనివారం సమావేశం అయ్యారు. 
 
ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలలో ఉన్న తాజా పరిస్థితులను తెలుసుకున్న గవర్నర్, ప్రతి విద్యార్థి సామాజిక దూరం గురించి కుటుంబ సభ్యులకు తెలిసేలా తమ వంతు ప్రయత్నం చేయాలని, ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు తమ పరిధిలోని కళాశాలల ద్వారా విద్యార్థులకు ఇ-మెయిల్ విధానంలో పిలుపును ఇవ్వాలని సూచించారు.
 
ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులకు సామాజిక దూరం గురించి అవగాహన కలిగించగలిగినా ఈ సందేశం లక్షల మందికి చేరుతుందని గౌరవ గవర్నర్ అశాభావం వ్యక్తం చేసారు. మరోవైపు విశ్వవిద్యాలయాలలో అందుబాటులో ఉన్న మౌళిక వసతులను ప్రస్తుత కష్ట కాలంలో సద్వినియోగ పరుచుకోవలసి ఉందని, అతి త్వరలోనే తాను ఈ అంశానికి సంబంధించి విశ్వవిద్యాలయాల కులపతులతో సమావేశం కానున్నానని హరిచందన్ పేర్కొన్నారు.
 
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి, పాలనకు తోడ్పడటానికి విశ్వవిద్యాలయ వనరుల వినియోగం గురించి దృశ్య శ్రవణ విధానంలో వీసీలతో తాను చర్చిస్తానన్నారు. ఈ సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.