శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: శనివారం, 21 మార్చి 2020 (22:21 IST)

జనం కోసమే జనతా కర్ఫ్యూ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్

ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ స్పష్టం చేసారు. కరోనా మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికి వారు తమ దాకా రాదులే అన్న భావనలో ఉండవద్దని గవర్నర్ హితవు పలికారు. 
 
బయట ఎంత ఎక్కువగా తిరిగితే అంతగా నష్టం వాటిల్లుతుందని, మనతో పాటు కుటుంబీకులు, ఇరుగు పొరుగువారు కూడా వైరస్‌ బారిన పడతారని గవర్నర్ హెచ్చరించారు. తాజా పరిస్థితిని ఎదుర్కునేందుకు సంయుక్తంగా పోరాడాలని ఆదివారం ‘‘జనతా కర్ఫ్యూ’’ పాటించాలన్న ప్రధాన మంత్రి సూచనను అందరం పాటిద్దామని సూచించారు. 
 
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు అడుగుపెట్టరాదని కోరారు. జనతా కర్ఫ్యూ మన స్వయం నియంత్రణకు ఓ సంకేతం వంటిది కాగా, ప్రతి ఒక్కరూ కనీసం 10 మందికి ఈ సందేశాన్ని చేరవేసి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.
 
కృతనిశ్చయం, సంయమనం ప్రాతిపదికన వైరస్‌కు చరమగీతం పాడాలన్న ప్రధాని పిలుపు ఎంతో విలువైనదన్న బిశ్వ భూషణ్, ప్రతీ చోటా సామాజిక దూరం అత్యావశ్యకమన్నారు. కరోనా అతి వేగంగా విస్తరిస్తున్నట్లు వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని ఇప్పటివరకు కరోనాకు మందు లేనందున కొన్ని వారాల పాటు బయట తిరగకుండా ఇంటి నుండే పని చేసేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ తరహా జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తి గొలుసును అధికమించగలుగుతామన్నారు. 
 
జనతా కర్ఫ్యూ ఆవశ్యకత గురించి స్వచ్ఛంధ సంస్థలతో పాటు రెడ్‌క్రాస్, ఎన్‌సిసి, స్కౌట్స్, గైడ్స్, ఎన్ఎస్ఎస్ వంటి వ్యవస్థలు ప్రజలకు వివరించాలన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని వారిని ప్రోత్సహించేలా సమాజం వ్యవహరించాలని గవర్నర్ అన్నారు. మానవాళి మనుగడ కోసం చేపడుతున్న ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని బిశ్వ భూషణ్ పేర్కొన్నారు.
 
మరింత అప్రమత్తత అవసరం
కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ప్రభుత్వం, పౌర సమాజం సంయిక్త భాగస్వామ్యంతోనే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకు రాగలుగుతామన్నారు. శనివారం రాజ్ భవన్ వేదికగా గవర్నర్ ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. 
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కరోనా రాష్ట్ర ప్రత్యేక అధికారి విజయ రామరాజు, కేంద్రం నుండి ప్రత్యేకంగా నియమించబడిన ప్రత్యేక అధికారి సురేష్ కుమార్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితిని నీలం సహానీ గవర్నర్‌కు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా చేపడుతున్న చర్యలను జవహర్ రెడ్డి విశదీకరించారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం సమన్వయంతో పనిచేస్తున్నాయని సురేష్ కుమార్ తెలిపారు.