సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (18:24 IST)

ఎల్వీకి తేరుకోలేని షాకిచ్చిన సీఎం జగన్.. కారణమిదే...

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఎల్వీని తప్పించి, బాపట్లలోని హెచ్.ఆర్.డి. డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అదేసమయంలో ఇన్‌ఛార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమించారు. ఈయన ప్రస్తుతం సీసీఎల్‌ఏలో పని చేస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌ నీరబ్ కుమార్‌కు అప్పగించి.. వెంటనే వెళ్లి తన విధుల్లో చేరాలని జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీతో ఏపీ అధికార యంత్రాంగం షాక్ అయ్యింది. ఎన్నికల ముందు ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయనే కొనసాగుతూ వచ్చారు. మార్పు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రాజకీయ వర్గాల్లోనే ఇదే చర్చనీయాంశం అయ్యింది.
 
జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు. చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. మొదట్లో ఢిల్లీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా సీఎం జగన్ వెంటే ఉన్నారు. కానీ, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు సమన్లు జారీ చేసి చిక్కుల్లో పడ్డారు. సీఎంవోలోని ముఖ్యకార్యదర్శికి సమన్లు జారీ చేయడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇది ముఖ్యమంత్రి జగన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎల్వీపై వేటు వేసినట్టు సమాచారం.