శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (21:03 IST)

వ్యక్తుల కోసం కాదు వ్యవస్థ కోసమే... 20 నుంచి ‘మహాప్రస్థానం’ వాహనాలు... కామినేని

అమరావతి : వ్యక్తుల కోసం కాదు... వ్యవస్థ కోసమే పీజీ డిగ్రీ కలిగిన వైద్యుల పదవీ విరమణ వయస్సు 63 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయం నాలుగో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్

అమరావతి : వ్యక్తుల కోసం కాదు... వ్యవస్థ కోసమే పీజీ డిగ్రీ కలిగిన వైద్యుల పదవీ విరమణ వయస్సు 63 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయం నాలుగో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పదవీ విరమణ పెంచాలంటూ పీజీ డాక్టర్ల అసోసియేషన్ ఇటీవల వినతిపత్రం అందజేసిందన్నారు. పదవీ విరమరణ వయస్సు పెంపుదల ప్రక్రియ రెండు నెలలుగా కొనసాగుతోందన్నారు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదన్నారు. 
 
డాక్టర్, పేషంట్ నిష్పత్తి దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వైద్యుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచిందన్నారు. ఇదే విషయమై రాష్ర్టాల్లోనూ పెంచాలని సూచించందని మంత్రి కామినేని తెలిపారు. పదవీ విరమణ పెంపుదల సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వివరించామన్నారు. సీఎం అంగీకరించిన తరవాతే దీనిపై నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేగాని ఒత్తిళ్లకు లొంగి పెంచలేదన్నారు. ఒక ఇంజనీరు 23 ఏళ్లకు ఉద్యోగంలో చేరతాడన్నారు. అదే పీజీ చేసిన వైద్యుడు 27 ఏళ్లకు బాధ్యతలు చేపడతారని, డాక్టర్ల సంఖ్య తక్కువగా వుండటంతో  వారి రిటైర్మెంట్ వయస్సు పెంచాలని  నిర్ణయించామని మంత్రి వివరించారు. దీనివల్ల మిగిలిన డాక్టర్లకు పదోన్నత్తుల్లో అన్యాయం జరగదని, వారికి కూడా భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని మంత్రి వెల్లడించారు.
 
ఏపీపీఎస్సీ ద్వారా 327 డాక్టర్ల పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ పోస్టుల్లో 198 అసిస్టెంట్ పోస్టులు, 129 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులున్నాయన్నారు. గతేడాదికంటే ఈడాది పీజీ సీట్లు పెరిగాయన్నారు. ప్రస్తుతం 3,100 సీట్లు ఉండగా, డిమాండ్ లేని 165 సీట్లు మినహా మిగిలినవన్నీ భర్తీ అయ్యాయన్నారు.
 
బదిలీలన్నీ పారదర్శకంగా...
వైద్య, ఆరోగ్య శాఖలో 353 క్యాడర్లు ఉండడం వల్ల బదిలీల గడువును పెంచాలని సీఎం చంద్రబాబునాయుడిని కోరామని మంత్రి కామినేని తెలిపారు. ఎటువంటి అవకతవకలూ చోటు చేసుకోకుండా బదిలీలు చేపడతామన్నారు. బదిలీలు పారదర్శకంగా జరిగేలా కౌన్సెలింగ్ కోసం రీజనల్ డైరెక్టర్లకు మరో ఇద్దరు సీనియర్ అధికారులు కేటాయించామన్నారు. అలాగే, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ ల కూడా మరో ఇద్దరు సీనియర్ అధికారులను అందుబాబులో ఉంచామన్నారు. బదిలీల్లో అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమన్నారు. 
 
ఆ వార్త నిజం కాదు...
బదిలీల ఫైళ్లను ఇంటికి తీసుకెళ్లి సంతకాలు చేసినట్లు ఒక దినపత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను గత నెల 26న అమెరికా వెళ్లానని, తాను శుక్రవారం అమరావతి వచ్చానని తెలిపారు. రాష్ర్టంలో లేని సమయంలో ఇంటికి ఫైళ్లు తీసుకెళ్లి ఎలా సంతకాలు చేయగలనని ప్రశ్నించారు. ఇటువంటి వార్తలు రాయడం సరికాదని మంత్రి హితవు పలికారు.
 
జులై 1 నుంచి మదర్ కిట్ల పంపిణీ...
జులై ఒకటో తేదీ నుంచి బాలింతలకు బసవతారకం మదర్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కిట్ లో మఫ్లర్, ఫీడింగ్ గౌన్లు, ఫ్లాస్కు, దుప్పటి ఉంటాయన్నారు.
 
ఈ నెల 20 నుంచి మహాప్రస్థానం వాహనాలు...
ప్రభుత్వ వైద్య శాలల్లో చికిత్స పొందుతూ చనిపోయిన వారి మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చడానికి మహాప్రస్థానం కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ముందుగా మెడికల్ కాలేజీలున్న 11 వైద్యశాలలతో పాటు ఏలూరు, విజయనగరం జిల్లా ఆసుపత్రులకు ఒక్కో వాహనాన్ని మహాప్రస్థానం కార్యక్రమం కింద సమకూరుస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలోని మిగిలిన ఆసుపత్రులకూ వాహనాలు అందజేస్తామన్నారు. ఈ వాహనాల ద్వారా మృతదేహాలను ఇళ్లకు తరలిస్తామన్నారు. వాహనాలను సమకూర్చడానికి టెండర్లు పిలిచామన్నారు. రేపో మాపో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని మంత్రి కామినేని తెలిపారు.
 
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రభుత్వం పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందజేస్తుందన్నారు. ఈ సేవలు అందించే విషయంలో వైద్య సిబ్బంది డబ్బులు అడిగితే, నేరుగా తనకు గాని, ఏసీబీకి గాని ఫిర్యాదు చేయొచ్చునని మంత్రి పేర్కొన్నారు. తప్పు చేయాలంటే సిబ్బందిలో భయం కలుగాలన్నారు. 
 
త్వరలో ఫ్యామిలీ మెడిసిన్ సీట్లు...
వైద్య కళాశాలలు ఉన్నచోట్ల కొత్త యూనిట్లు పెంచాలని యోచిస్తున్నామని, ఫ్యామిలీ మెడిసిన్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని మంత్రి కామినేని తెలిపారు. ప్రస్తుతం వైద్యం ఒక్కో విభాగానికి పరిమితమైందన్నారు. గతంలో ఒకే వైద్యుడు అన్ని వ్యాధులకు వైద్యమందించేవారన్నారు. ఇదే తరహాలో ఫ్యామిలీ మెడిసిన్ సీట్లు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఇందుకు సంబంధించి స్వీమ్స్ లో దరఖాస్తు చేయాలని వైద్య కళాశాలకు సూచించామన్నారు. ఫ్యామిలీ మెడిసిన్ కు సంబంధించి  మౌలిక సదుపాయలను ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. హెల్త్ కార్డులున్న ఉద్యోగులకుగాని, జర్నలిస్టులకు గాని వైద్య సేవలను అందించడానికి నిరాకరిస్తే, ఆయా రిఫరల్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.