ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (17:51 IST)

మరో కేసులో చంద్రబాబు అరెస్టుకు సిద్ధం.. కానీ, సోమవారం వరకు ఉపశమనం

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును మరో కేసులో అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకోసం అన్ని వివరాలను సేకరించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ఓ నిందితుడుగా ఉన్నారు. ఇదే కేసులో ఆయన కుమారుడు నారా లోకేశ్‌ను ప్రస్తుతం ఏపీ సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. ఆయన్ను కూడా ఈ కేసులో అరెస్టు చేయొచ్చని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును కూడా ఐఆర్ఆర్ కేసులో వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 
 
ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారించింది. చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే, కేసుల విచారణకు సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్, అరెస్టు వారెంటులపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆదేశాలు జారీచేసింది. 
 
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పీటీ వారెంట్ లేనపుడు ముందస్తు బెయిల్ ఎందుకని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఒకవేళ పీటీ వారెంట్ వేస్తే ఇబ్బంది అవుతుందని చంద్రబాబు తరపు న్యాయవాది చెప్పారు. మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసులో హైకోర్టు గురువారం విచారించనుంది. ఈ నేపథ్యంలో అంగళ్లు కేసులో రేపటి వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని సీఐడీని ఆదేశించింది.