1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 మే 2023 (16:50 IST)

అసోసియేషన్ గుర్తింపు రద్దుకు హైకోర్టు నో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో షాక్ కొట్టింది. అదేసమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది.
 
ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 
 
గతంలో జీతాలకు సంబంధించి గవర్నర్‌ను కలవడంపైనా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నోటీసును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాణిజ్య పన్నుల సర్వీసు అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.