గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

పిచ్చి అభిమానం... పవన్ కళ్యాణ్ అభిమానిని కొట్టి చంపేసిన ప్రభాస్ అభిమాని.. ఎక్కడ?

murder
సినీ హీరోలపై ఉన్న పిచ్చి అభిమానం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇద్దరు స్టార్ హీరోలకు చెందిన అభిమానుల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారితీసింది. ఈ క్రమంలో ప్రభాస్ వీరాభిమాని ఒకరు, పవన్ కళ్యాణ్ వీరాభిమానిని కర్రతో కొట్టి, బండరాయితో మోది చంపేశాడు. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ అనే ఇద్దరు యువకులు భవనాలకు రంగులు వేసే కార్మికులుగా కలిసి పని చేస్తున్నారు. వీరిలో హరికుమార్ హీరో ప్రభాస్ అభిమాని కాగా, కిషోర్ కుమార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. 
 
అయితే, హరి కుమార్ తన మొబైల్ స్టేటస్‌లో ప్రభాస్ వీడియోలను పెట్టుకున్నాడు. వీటిని చూసిన కిషోర్.. ప్రభాస్ వీడియోలు కాకుండా పవన్ కళ్యాణ్ వీడియోలు పెట్టుకోవాలని హరికుమార్‌ను ఒత్తిడి చేశారు. అప్పటికే వారిద్దరు మద్యం సేవించి వుండటంతో వారి మధ్య మాటామాటా పెరిగి పెద్ద వాగ్వాదానికి దారితీసింది. 
 
దీంతో ఆగ్రహించిన హరికుమార్.. పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రతో కిషోర్ కుమార్ తలపై గట్టిగా కొట్టడంతో కిందపడిపోయాడు. ఆ తర్వాత బండరాయిని తీసుకుని కిషోర్ ముఖంపై బలంగా మోదడంతో అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హరికుమార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.