1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (13:13 IST)

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు భారీ ఊరట...

kodikathi case
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరుచేసింది. ఈ కేసులో గత ఐదేళ్ళుగా కోడికత్తి శ్రీను జైలులో మగ్గిపోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గత నెల 24వ తేదీన విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ తీర్పును గురువారం ప్రకటించింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదని, రూ.25 వేల పూచీకత్తుపై రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో హజరై సంతకం చేయాలని, ర్యాలీల్లో పాల్గొనరాదని తదితర షరతులు విధించింది. కాగా, హైకోర్టు తీర్పుపై దళిత, పౌర హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే, ఈ కేసులో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో సాక్షిగా ఉన్న విషయం తెల్సిందే. అయితే, ఆయన సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాకపోవడంతో కోడికత్తి దాడి కేసులో శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంది.