గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (11:00 IST)

సిద్ధం.. సిద్ధం అంటూ పోస్టర్లు వేశారు.. పారిపోవడానికి సిద్ధమా మిస్టర్ జగన్ : ఎంపీ బాలశౌరి

Bala Showri
Bala Showri
సిద్ధం.. సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పిచ్చిపట్టినట్టుగా పోస్టర్లు వేశారనీ, ఈ రాష్ట్ర వదిలి పారిపోవడానికి సిద్ధమా మిస్టర్ జగన్ అని వైకాపాకు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. ఆయన ఆదివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
సీఎం జగన్ ఎక్కడ మాట్లాడినా తాను అబద్ధాలు చెప్పనని చెబుతారని, కానీ, అలా చెప్పడమే జగన్ చెప్పే పెద్ద అబద్ధమన్నారు. మాట్లాడితే పైన దేవుడు ఉన్నాడు అంటారు... నాకు, వైఎస్ షర్మిలకు, వైఎస్ సునీతకు కూడా అదే దేవుడు ఉన్నారనే విషయాన్ని జగన్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 
 
సిద్ధం సిద్ధం అంటూ రాష్ట్ర మొత్తం పోస్టర్లు వేశారు.. జగన్ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని బాలశౌరి ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. 
 
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా తాను, తెనాలి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ పనిచేశామని ఆయన చెప్పారు. ఆ ఐదేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుతం అలాంటి పరిస్థితిలేదన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు. 
 
పవణ్ కల్యాణ్ ప్రశ్నించే గుణం ఉందని, అందుకే ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించిందని అన్నారు. కాగా, ఆదివారం, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 
 
జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.