శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 22 డిశెంబరు 2021 (18:39 IST)

జీవోలు రహస్యం అతి రహస్య‌మ‌నేది ఎలా నిర్ణయిస్తారు? హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం జీవోఐఆర్‌టీ వెబ్‌సైట్‌లో జీవోలను ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై మండిపడింది. అస‌లు ఈ జీవోలు అతి ర‌హస్య‌మ‌ని ఎలా మీరు నిర్ణ‌యిస్తార‌ని ప్ర‌శ్నించింది.

 
జీవోలను ఈ-గెజిట్‌లో ఉంచుతామని ఏపీ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేయగా, దాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఈ గెజిట్‌లో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో జీవోలు ఉంచడం లేదని.. కేవలం 4 నుంచి 5 శాతమే ఉంచుతోందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ తీరు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని వాదించారు.
 
 
ఈ వాదనలకు సమాధానంగా, అతి రహస్య జీవోలే అప్‌లోడ్ చేయట్లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ జీవోలు రహస్యం, అతి రహస్యమని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. వెబ్‌సైట్‌లో ఉంచిన, రహస్య జీవోల వివరాలను తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఉన్నత న్యాయస్థానం దీనిపై విచారణను ఈ నెల28కి వాయిదా వేసింది.