గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 20 డిశెంబరు 2021 (14:43 IST)

ఎన్నిక‌లు ముందుకు... జ‌మిలి దిశగా కేంద్రం పావులు!

జ‌మిలి అంటే, దేశవ్యాప్తంగా అంతాటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్రం పావులు క‌దుపుతోంది. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు ఆటంకంగా ఉన్నాయని భావిస్తున్న పలు సమస్యల్ని పరిష్కరించే దిశగా ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం వేస్తోంది. 

 
దీంతో జమిలి ఎన్నికలపై ఏ క్షణమైనా కేంద్రం ఓ ప్రకటన చేయడం ఖాయంగా కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతా సజావుగా జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణలు చేపడుతోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన కొన్ని సంస్కరణలతో పాటు ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే జమిలి ఎన్నికలు మరెంతో దూరంలో లేవని స్పష్టమవుతోంది. 
 
 
వేగంగా ఎన్నికల సంస్కరణలు, జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ఆధార్ తో ఓటరు కార్డు లింక్ చేయడం వంటి సంస్కరణల ద్వారా దేశంలో మెజారిటీ జనాభాను ఓట్ల ప్రక్రియలో భాగస్వాముల్ని చేసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. వీటికి కేంద్రం కూడా తాజాగా ఆమోదముద్ర వేసింది. అలాగే పార్లమెంటు సమావేశాల్లో ఎన్నికల సంస్కరణలపై బిల్లు పెట్టేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. 

 
ప్రస్తుతం ఒక్కో ఎన్నికలకు ఒక్కో ఓటరు జాబితాల్ని రూపొందిస్తున్నారు. వీటి స్ధానంలో ఈసారి నుంచి అన్ని ఎన్నికలకు ఉపయగపడే విధంగా ఒకే ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కేంద్రం తాజాగా ఆమోదించిన ఎన్నికల సంస్కరణలతో ఇలా ఒకే ఓటరు జాబితా తయారు చేసేందుకు వీలు కలగనుంది. ముఖ్యంగా ఏడాదికి నాలుగుసార్లు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఒకే ఓటర్ల జాబితా రూపకల్పనకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే 25 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈసీ రూపొందించిన ఉమ్మడి ఓటర్ల జాబితాను స్ధానిక ఎన్నికలకు సైతం వాడుతున్నాయి. మిగతా రాష్ట్రాల్ని కూడా ఈ దిశగా నడిపించడమే దీని ఉద్దేశం.
 
 
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తమ చట్టాల్ని సవరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రతీ ఏటా జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే తాజా ఓటర్ల జాబితాను అనుసరించగలిగితే చాలా సమస్యలు దూరమవుతాయని ఈసీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే ఓటర్ల జాబితా ఆధారంగా స్ధానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది.


ఒకే ఓటరు జాబితా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేస్తే ఇక జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఈ దిశగా మిగతా రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెటులో త్వరలో ఓ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.