గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (16:32 IST)

సీఎం జగన్ సర్కారుకు హైకోర్టు షాక్ : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెండ్ చెల్లదంటూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు వైకాపా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఇందులోభాగంగా, ఆయనపై చర్యలు తీసుకుంది. 
 
విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఏబీ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్‌కు వెళ్లగా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది. 
 
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు గత తెదేపా ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేసి, ఆయన్ను వైకాపా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై అప్పట్లో ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 
 
దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.... ఆ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌పై సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేసింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది.