చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు.. ప్రతిపక్ష నేత.. గుర్తుపెట్టుకోవాలి : సుచరిత
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పలు వ్యక్తిగత ఘర్షణల నేపథ్యంలో హత్యలు, దాడులు జరిగాయని వాటిని ప్రభుత్వంపై మోపడానికి, బురదజల్లే కార్యక్రమానికి కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలియజేశారు.
మంగళవారం సాయంత్రం సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో విలేఖర్లతో మంత్రి సుచరిత మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నాటి నుంచే ప్రతిపక్షాలు ప్రభుత్వం లేనిపోని ఆరోపణలను చేయడం అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలను ఖండిస్తున్నామన, వాటిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టడంతో పాటు వివరాలను సేకరించడం జరుగుతోందని మంత్రి అన్నారు. కుటుంబ కలహాలు, ప్రాంతాల ఘర్షణల నేపథ్యంలో 6 ప్రాంతాల్లో హత్యలు, ఆత్మహత్యలు, వ్యక్తిగత దాడులు జరిగాయన్నారు. వీటికి సంబంధించి వార్తలు కూడా పలు పత్రికలు, ఛానళ్లలో ప్రసారం అవడం జరిగిందన్నారు.
వీటిని ప్రభుత్వంపై, అధికార పక్షంపై మోపడానికి కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, వాస్తవాలు ప్రజలకు తెలుసని మంత్రి అన్నారు. ఇప్పటికైనా అటువంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరారు.
ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ సూచించిన దానికంటే ఎక్కువ భద్రత కేటాయించామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సూచించిన ప్రకారం వాస్తవంగా 58 మందినే భద్రత కోసం కేటాయించాలని ఆమె తెలిపారు.
కానీ ఇప్పటికే 74 మంది భద్రతా సిబ్బంది వివిధ కేటగిరిల్లో చంద్రబాబునాయుడుకు రక్షణగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. తాను విపక్ష నేత అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి అంశానికి ప్రతిపక్షనేత, వారి మద్దతుదారులు రాజకీయ రంగు పులుముతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ప్రచారం కల్పించడం మానుకోవాలని హితవు పలికారు. బులెట్ ప్రూఫ్ కారు, ఎస్కార్ట్ కారు కూడా ఇచ్చామని, అయినా కూడా భద్రత తొలిగించామని ఆయన ఆరోపించడం సరికాదని మంత్రి అన్నారు.
ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి భద్రత తగ్గింది అని అనవసర ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. అయితే ఏనాడూ ఆయన ఈ ప్రభుత్వాన్ని భద్రత కావాల్సిందిగా కోరలేదని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అయితే మరింత భద్రత కావాలని చంద్రబాబునాయుడు కోరితే తప్పకుండా పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె తెలిపారు. ఇంటివద్ద ఆర్మ్డ్ స్టాటిక్ గార్డు 2+8 కేటాయించాల్సి ఉండగా 4+16 కేటాయించామన్నారు. రౌండ్‌ది క్లాక్‌గా ఇద్దరు పీఎస్వోలు మూడు షిప్టులుగా పని చేయాల్సి ఉండగా ఆరుగురిని కేటాయించామన్నారు. రెండు ఎస్కార్ట్ గార్డులు 1+3 ని మూడు షిప్టులుగా 24 మందిని కేటాయించాల్సి ఉండగా 24 మందిని కేటాయించామని మంత్రి అన్నారు.
అదేవిధంగా వాచర్స్ ను ఐదు మందికి ఐదు మందిని, ఒక రిజర్వ్ ఇన్ స్పెక్టర్ ని, 12 మంది తనిఖీ సిబ్బందిని, బుల్లెట్ ఫ్రూఫ్ కారు మరియు ఒక జామర్ వాహనాన్ని సమకూర్చామని మంత్రి తెలిపారు. మూడు షిప్టులుగా షిప్ట్ కు ఇద్దరు డ్రైవర్ల చొప్పున ఆరుగురిని కేటాయించామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ మొత్తం సిబ్బంది కేటాయింపులు భద్రతలో భాగంగా కేటాయింపులు జరిపినట్లు ఆమె తెలిపారు. ప్రతిపక్షనేత భద్రత విషయంలో రాజకీయాలు మానుకోవాలని మంత్రి సుచరిత కోరారు.