1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (13:14 IST)

ఒరేయ్.. ఆటోలు తీయకండి.. స్టార్ట్ చేయకండి.. మంత్రి ధర్మాన కేకలు

dharmana
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పీఎస్ఎన్ఎంహెచ్ పాఠశాలలో శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో సోమవారం జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 
 
అయితే, ఆయన ప్రసంగించే సమయంలో అనేక మంది డ్వాక్రా మహిళలు, లబ్ధిదారులు సమావేశ మందిరం నుంచి గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్న దృశ్యాలను మంత్రి చూశారు. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'ఐదు నిమిషాల్లో సమావేశం ముగియనుంది. ఏయ్‌ తల్లీ వెళ్లిపోదురు ఆగండి. 
 
ఒరేయ్‌.. ఆటోలు తీయకండి. స్టార్ట్‌ చేయకండి.. ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది' అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కార్యక్రమాలకు హాజరైన మహిళలు  మాత్రం మంత్రి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మధ్యలోనే వెనుదిరిగిపోయారు. వీరిని నిలువరించేందుకు అధికారులు, వలంటీర్లు విశ్వప్రయత్నాలు చేశారు. 
 
సమావేశం జరిగే పాఠశాల గేటుకు తాళం వేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వారు ఎత్తయిన గోడ ఎక్కి బయటకు దూకి వెళ్లిపోయారు. పోతూపోతూ అధికారులకు శాపనార్థాలు పెట్టారు.