మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జులై 2019 (11:43 IST)

ఇది రైతు ప్రభుత్వం... అమానుషంగా ప్రవర్తిస్తే అంతేసంగతులు : మంత్రి కన్నబాబు

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల్ని కలుసుకొని వారి వినతులు స్వీకరించే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని రేపటి నుంచి జరగబోతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయని దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. త్వరలో ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం వైయస్ జగన్ సంకల్పించారని అయితే ఈలోపు అసెంబ్లీ కార్యక్రమాలు ప్రారంభం కానున్నందున, వచ్చే ప్రజలకు వసతులు ఏర్పాటు పూర్తి కాకపోవటం వల్ల ప్రజాదర్భార్ వాయిదా పడిందని కన్నబాబు తెలిపారు. 
 
కొన్ని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు, నేషనల్ బ్యాంకులు రైతులు నుంచి రుణాలు వసూలు చేసే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే సమాచారం వచ్చిందని కన్నబాబు తెలిపారు. ఆ పద్ధతులు మార్చుకోవాలని వ్యవసాయ శాఖ నుంచి కొన్ని బ్యాంకుల వారికి ఆదేశాలు జారీచేయటం జరిగిందని కన్నబాబు తెలిపారు. 
 
'నిన్ననే ప్రకాశం జిల్లాలో డీసీసీబీ బ్యాంకు ఓ రైతు భూమిలో జెండాలు పాతినట్లు మాకు సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా తెలిపామని చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయటం జరిగింది. . రైతులకు నచ్చ చెప్పి.. ఒకటికి నాలుగు సార్లు వారి ఇంటికి వెళ్లి గౌరవపూర్వకంగా రుణాలు వసూలు చేసుకోండి తప్ప.. వారిని అవమానపరిచే కార్యక్రమాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశాం. సంబంధిత కలెక్టర్ తోనూ మాట్లాడటం జరిగిందని' కన్నబాబు చెప్పారు.
 
ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటన చేసి ఉన్నారు. అదే విధంగా అధికారులు రైతులతో సంయమనంతో ముందుకు వెళ్లాలని చెబుతున్నాం. రైతుల్ని ఆదుకునే కార్యక్రమాలను నెల రోజుల్లోనే సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు. రైతులు కూడా ఒత్తిడికి గురికాకుండా సంయమనంగా ఉండాలని కోరుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు.