ఎపిలో పంచాయతీ ఎన్నికలు జరిపించేందుకు నిమ్మగడ్డ పట్టు, జగన్ సర్కార్ కస్సుబుస్సు
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు, ప్రభుత్వానికి మధ్య పెద్ద వార్ నడుస్తోంది. ప్రభుత్వ సిఎస్ నీలం సాహ్ని, మంత్రి కొడాలి నానిలు వెనక్కి తగ్గడం లేదు. నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తుంటే.. సిఎస్ మాత్రం పంచాయతీ ఎన్నికలు జరగనీయకుండా చూస్తున్నారు.
ఇదంతా సిఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందన్నది బహిరంగ రహస్యం. నిమ్మగడ్డ నియామకంపై అప్పట్లో రచ్చ రచ్చే. అసలు ముఖ్యమంత్రి నేనా లేకుంటే నిమ్మగడ్డా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సిఎం. ఇది కాస్త రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అంతేకాదు ప్రతిపక్ష నేతలు నిమ్మగడ్డకు బాసటగా నిలవడం మరింత రచ్చకు దారితీసింది.
కరోనా కారణంగా పంచాయతీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు మొదట్లో నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. పంచాయతీలు ఏకగ్రీవమవుతున్న సమయంలో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై జగన్ మండిపడ్డారు. ఇది కాస్త అధికార పార్టీ నేతలకు బాగా కోపాన్ని తెప్పించింది.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇక పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు నిమ్మగడ్డ రమేష్. కానీ ఇప్పుడు ప్రభుత్వం సుముఖంగా లేదు. కరోనా బూచి చూపించి ఎన్నికలను తప్పించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటు నిమ్మగడ్డ వేగంగా ముందుకు సాగుతుండటం.. ఎలాగైనా ఎన్నికలు జరిపేలా ప్రయత్నాలు చేస్తుండటం కాస్త రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది.
ఒకవైపు అధికార పార్టీ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఓడిపోతామోనన్న భయం కనబడుతోందని ప్రతిపక్షాలు ప్రచారాన్ని ప్రారంభించాయి. అందుకే నిమ్మగడ్డను ఎన్నికలు జరగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న ప్రచారం బాగానే ఉంది. కానీ వారం రోజుల్లో ఎలాగైనా షెడ్యూల్ విడుదల చేయాలని నిమ్మగడ్డ రమేష్ అయితే ప్రయత్నిస్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వ పట్టు నెగ్గుతుందా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంతం నెరవేర్చుకుంటారోనన్నది.. ఇప్పడిదే ఆసక్తికరంగా మారుతోంది.