ఏపీలో మద్యం గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనపై కమీషనర్ కన్నెర్ర
మద్యం విక్రయాలకు సంబంధించి గరిష్ట చిల్లర ధరను పాటించకపోవటంపై అబ్కారీ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా కన్నెర్ర చేసారు. నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే ఏ స్థాయి అధికారినైనా ఇంటికి పంపుతామని హెచ్చరించారు. తప్పొప్పులకు కేవలం క్రింది స్ధాయి అధికారులను మాత్రమే బాధ్యులను చేయబోనని, జిల్లా స్థాయి అధికారులపై సైతం చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసారు.
పోలింగ్ తదుపరి గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలపై కమీషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా, గురువారం ఈ విషయంపై ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. ఎక్సైజ్ విభాగపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్‌తో కలిసి విజయవాడ కమీషనరేట్ నుండి డిప్యూటీ కమీషనర్‌లు, అదనపు కమీషనర్‌లు, ఎక్సైజ్ సూపరిండెంట్‌లతో వీడియో కాన్పరెన్స్ చేపట్టిన కమీషనర్ జిల్లాల వారిగా పరిస్ధితులపై ఆరా తీసారు.
కమీషనర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిఘావర్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆయా జిల్లాల డిసిలు, ఎసిల ముందు ఉంచారు. నిబంధనల మేరకే విక్రయాలు జరగాలన్న మీనా, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. రానున్న వారం రోజుల పాటు జిల్లా స్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు స్పెషల్ డ్రైవ్ చేపడతాయి. తదుపరి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఎస్‌టిఎఫ్ బృందాలు రంగంలోకి దిగుతాయి. కేసు నమోదు చేసిన మరుక్షణం లైసెన్స్ సస్పెండ్ కానుండగా, విచారణ అనంతరం శాశ్వతంగా లైసెన్సు రద్దు చేస్తారు.
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్న తరుణంలో విశాఖపట్నంలో ఒక పార్టీ కోసం మద్యం వినియోగానికి అనుమతి ఇవ్వటంపై ఇప్పటికే అక్కడి ఎక్సైజ్ సూపరిండెంట్ సుబ్బారావును విధుల నుండి తొలిగించిన కమీషనర్, పూర్తి స్థాయి విచారణ కోసం కేంద్ర కార్యాలయం నుండి జాయింట్ కమీషనర్ దేవకుమార్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. నివేదిక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని, సాధారణ నిబంధనలతో పాటు ఎన్నికల నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉందని ముఖేష్ కుమార్ మీనా వివరించారు.
మరోవైపు పలు ఆరోపణల నేపధ్యంలో శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరిండెంట్‌ను అదినారాయణ మూర్తిని ఇప్పటికే ప్రభుత్వానికి సరెండర్ చేయగా ప్రస్తుతం పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ప్రభుత్వానికి సమాచారం పంపించామని కమీషనర్ ప్రకటించారు. నివేదిక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీనా వివరించారు. వీడియో కాన్సరెన్స్‌లో అదనపు కమీషనర్ భాస్కర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సహాయ కార్యదర్శి ప్రణవి తదితరులు పాల్గొన్నారు.